Molnupiravir: వైరస్‌ను ఏమార్చి హతమారుస్తుంది.. ఎవరికి మంచిది? ఎవరికి వద్దు?

India boosts arsenal against COVID-19 with Merck pill, two more vaccines - Sakshi

తప్పుడు మ్యుటేషన్లతో వైరస్‌ను నాశనం చేసే మోల్నుపిరావిర్‌

ఐదు రోజుల కోర్సుతో ఆస్పత్రిపాలయ్యే రిస్కు తగ్గుతుంది

కల్లోల కరోనా సోకకుండా టీకాలు చాలావరకు అడ్డుకుంటాయి. కానీ కరోనా సోకిన వారికి నిర్ధిష్టమైన వైద్యం పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉన్న వివిధ రకాల ఔషధాల కాంబినేషన్లను, యాంటీ వైరల్‌ మందులను వాడి కరోనా రోగులను కాపాడే యత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కరోనా సోకిన వారి చికిత్స కోసం ఫైజర్, మెర్క్‌ సంస్థలు మాత్రలు తయారుచేశాయి.

మెర్క్‌ తయారీ మోల్నుపిరావిర్‌ మాత్ర (‘EIDD 2801’’) కు భారత్‌లో తాజాగా అనుమతులు లభించాయి. కరోనాకు కళ్లెం వేయడంలో ఇది ఉపయోగపడుతుందని,  కరోనా వల్ల ఆస్పత్రి పాలవకుండా చాలావరకు కాపాడుతుందని కంపెనీ చెబుతోంది. భారత్‌లో దీన్ని సిప్లా తదితర సంస్థలతో కూడిన కన్సార్టియం వేర్వేరు పేర్లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో కొత్త మాత్ర కథా కమామీషు చూద్దాం..  

ఎవరికి మంచిది? ఎవరికి వద్దు?
కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరికి దీన్ని వాడే వీలు లేదు. కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఇవి బాగా ముదిరి మరింత అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్న(హైరిస్కు) వ్యక్తులకు మాత్రమే డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు వృద్దులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే వీటిని సిఫార్సు చేస్తారు. ఇక 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ మందు వాడకూడదు. ఇది వారిలో ఎముకల వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే గర్భిణులకు కూడా దీన్ని సిఫార్సు చేయరు. వీరికి ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిపాలై చికిత్స పొందేవారికి దీని వాడకం కూడదు.  

ఎప్పుడు ఆరంభించాలి?
కరోనా పాజిటివ్‌ వచ్చాక లక్షణాలు బయటపడుతున్న ఐదురోజుల్లోపు దీని వాడకం ఆరంభించాలి. దగ్గు, తలనొప్పి, జ్వరం, వాసన లేకపోవడం, నొప్పుల్లాంటి సంకేతాలు కరోనా తొలిరోజుల్లో ఉంటాయి. ఈ దశలోనే వీటని డాక్టర్‌ సిఫార్సుతో వాడాల్సి ఉంటుంది.  

ఎంత డోసేజ్‌?
ఈ మాత్రలు 200 ఎంజీ రూపంలో లభిస్తాయి. ప్రతి 12 గంటలకు ఒకసారి నాలుగు మాత్రల చొప్పున ఐదు రోజుల పాటు తీసుకోవడంతో కోర్సు పూర్తవుతుంది. అంటే మొత్తం కోర్సులో 40 క్యాప్సుల్స్‌ (ఐదు రోజులు– రోజుకు 8 మాత్రలు) వాడాల్సి ఉంటుంది. వరుసగా ఐదు రోజులకు మించి దీన్ని వాడకూడదని యూఎస్‌ ఎఫ్‌డీఏ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సహా దాదాపు అన్ని కోవిడ్‌ వేరియంట్లపై ఇది ప్రభావం చూపగలదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఫలితాలు ఎలా ఉన్నాయి?
కరోనా లక్షణాలు బయటపడ్డవారు (ఇంతవరకు వ్యాక్సిన్‌ తీసుకోనివారు) ఆస్పత్రి పాలయ్యే రిస్కును, చనిపోయే ప్రమాదాన్ని ఈ మందు వాడకంతో దాదాపు 30– 50 శాతం తగ్గించవచ్చని క్లినికల్‌ డేటా ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. దీన్ని కేవలం కరోనా సోకిన తర్వాత మాత్రమే వాడాలని, టీకాలకు బదులు దీన్ని తీసుకుంటే సరిపోతుందని భావించవద్దని నిపుణుల హెచ్చరిక.  

ప్రతికూలతలు
ఈ మాత్ర వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడంపై పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేమీ మ్యాజిక్‌ పిల్‌ కాదని, దీనివల్ల జరిగే మేలు పరిమితమని ప్రొఫెసర్‌ విలియం షాఫ్నర్‌ హెచ్చరించారు. దీని వాడకం వల్ల కొన్నిసార్లు డయేరియా, వికారం, వాంతులు, తలతిరగడం వంటి ప్రతికూలతలు కనిపించవచ్చు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లో దీన్ని 18 ఏళ్లు లోపువారికి, గర్భిణులకు, ఆస్పత్రిపాలైనవారికి వాడకూడదు. ఈ ఔషధానికి వైరస్‌ కణాల్లో ఉత్పరివర్తనాలను ప్రేరేపించే శక్తి ఉంది. ఈ శక్తి మానవ కణాలపై కూడా చూపే ప్రమాదం ఉందని, దీనివల్ల మానవ కణాల్లో అనవసర మార్పులు వచ్చి క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు ఉన్నాయి. కానీ దీన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాల్లేవు.  

ఏ దేశాల్లో అనుమతించారు?
ఇప్పటివరకు ఈ ఔషధానికి యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, భారత్‌లో అనుమతి లభించింది.

ధ్వంస రచన...
► ఉత్పరివర్తనాల్లో ఈ మందు కలగజేసే మార్పులతో వైరస్‌లోని మొత్తం మ్యుటేషన్‌ ప్రక్రియ తప్పులతడకగా మారడాన్ని ‘‘ఎర్రర్‌ కెటాస్ట్రోఫ్‌’’ లేదా ‘‘లీథల్‌ మ్యుటాజెనిసిస్‌’’ అంటా రు.  ఈ విధ్వంసం కారణంగా అతిధేయి శరీరంలో వైరల్‌ లోడు క్రమంగా తగ్గిపోతుంది.  
► సాధారణంగా రెమిడెసివిర్‌ లాంటి యాంటీ వైరల్‌ మందులు సదరు వైరస్‌లో పత్రికృతి (రిప్లికేషన్‌) ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా దాని వ్యాప్తిని నివారిస్తాయి. టీకాలు అతిధేయి శరీరంలో యాంటీబాడీ రెస్పాన్స్‌ను పెంచడం ద్వారా వైరస్‌ను అడ్డుకుంటాయి. వీటితో పోలిస్తే మోల్నుపిరావిర్‌ పనిచేసే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది.  

► ఇది వైరస్‌ రిప్లికేషన్‌ ప్రక్రియలో అవసరపడే ఎంజైములను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతో వైరస్‌ కణాల్లో తప్పుడు ఉత్పరివర్తనాలు ఆరంభమవుతాయి. వీటివల్ల రోగి శరీరంలో వైరస్‌ సంఖ్య పెరగడం ఆగిపోతుంది, ప్రతికృతి చెందిన వైరస్‌లు బతికినా అవి      బలహీనంగా ఉండి వెంటనే నశించిపోవడం జరుగుతుంది.  
► సింపుల్‌గా చెప్పాలంటే ఒక యంత్రంలో కీలక భాగాన్ని మారిస్తే దాని పనితీరు పూర్తిగా ధ్వం సమైనట్లే ఈ ఔషధం వైరస్‌పై పనిచేస్తుంది.  
► శాస్త్రీయ భాషలో చెప్పుకుంటే ఈ ఔషధం వైరస్‌లోని ఆర్‌డీఆర్‌ఏ (ఆర్‌ఎన్‌ఏ డైరెక్టెడ్‌ ఆర్‌ఎన్‌ఏ పాలిమరేజ్‌) ఎంజైమ్‌ను ప్రేరేపించి వైరల్‌ ఆర్‌ఎన్‌ఏలో పలు తప్పుడు మ్యుటేషన్లను కలిగిస్తుంది.
► ఆర్‌ఎన్‌ఏ నిర్మాణంలో అడినైన్, గ్వానైన్, యురాసిల్‌ (యురిడిన్‌), సైటోసిన్‌ అవసరమవుతాయి. వీటిని ఆర్‌ఎన్‌ఏ బిల్డింగ్‌ బ్లాక్స్‌ అంటారు.  
► మోల్న్యుపిరావిర్‌కు ఈ బిల్డింగ్‌ బ్లాక్స్‌లోని సైటిడిన్‌ (ఎన్‌హెచ్‌సీ– టీపీ) లేదా యురిడిన్‌ లాగా కనిపించే శక్తి ఉంది. దీంతో ఆర్‌డీఆర్‌ఏ ఎంజైమ్‌ దీన్ని వైరస్‌ ఆర్‌ఎన్‌ఏలో నిజమైన సైటిడిన్‌ లేదా యురిడిన్‌ బదులు ప్రవేశపెడుతుంది.  
► వైరస్‌ రిప్లికేషన్‌ను ప్రూఫ్‌ రీడింగ్‌ చేసే ఎక్సో న్యూక్లియేజ్‌ ఎంజైమ్‌లు కూడా ఈ తప్పును గ్రహించలేవు. దీంతో నిజమైన బిల్డింగ్‌ బ్లాక్స్‌ ఉన్న ఆర్‌ఎన్‌ఏ బదులు మోల్నుపిరావిర్‌ ఉన్న ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తి అవుతుంది.  
► ఇలా మారిన ఆర్‌ఎన్‌ఏ పలు తప్పుడు ఉత్పరివర్తనాలకు కారణమై పైన చెప్పుకున్న ఎర్రర్‌ కెటాస్ట్రోఫ్‌కు దారి తీస్తుంది.   

ఆ పేరే ఎందుకంటే..
అవెంజర్స్‌ సినిమాలు చూసినవారికి అందులో థోర్‌ పాత్ర, ఆ హీరో చేతిలోని శక్తులున్న ఆయుధం.. సుత్తి గుర్తుండే ఉంటాయి. ఈ సుత్తికి మొల్నిర్‌ అని పేరు. అలాగే యాంటీ వైరల్‌ మందులకు చివర ‘అవిర్‌’ అంత్య ప్రత్యయం (సఫిక్స్‌) పెడతారు.  కోవిడ్‌ వేరియంట్లపై థోర్‌ ఆయుధం లాగా విరుచుకుపడుతుందన్న ఉద్దేశంతో కొత్త మాత్రకు మోల్నుపిరావిర్‌ అని పేరు పెట్టినట్లు మెర్క్‌ కంపెనీ ఆర్‌ అండ్‌ డి అధిపతి డీన్‌ లీ చెప్పారు.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top