చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. తిమింగలం నోటిలో 30 సెకన్ల పాటు

Humpback Whale Gulps And Spits Out Cape Cod Lobsterman - Sakshi

యముడి ఇంటి తలుపు తట్టి రావడం అంటే ఇదేనేమో..! అమెరికాలో ఓ గజ ఈతగాడు దాదాపు ఇదే పనిచేసి వచ్చాడు. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. ఇంకా భూమిపై నూకలు తినే భాగ్యం ఉంది కాబట్టి బతికి బట్టకట్టాడు. ఇంతకీ ఏమైందంటే అమెరికాలోని కేప్‌ కాడ్‌ సముద్రతీర ప్రాంతంలో 56 ఏళ్ల మైఖేల్‌ పకార్డ్‌ ఈత కోసం వెళ్లాడు. 45 అడుగుల లోతులో ఉండగా, ఒక్కసారిగా తాను పెద్ద కుదుపునకు గురయ్యాడు. అంతలోనే చుట్టూ చిమ్మచీకటి కమ్ముకుంది. షార్క్‌ చేప మింగేసిందని మొదట అనుకున్నాడు. అయితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిమింగలం మింగిందని, ఇక తన పని అయిపోయినట్లేనని భావించాడు. హంప్‌బ్యాక్‌ తిమింగలం నోటిలో దాదాపు 30 సెకన్ల పాటు ఉన్నాడు.

గాలి పీల్చుకునేందుకు అవసరమైన పరికరం ఉండటంతో గాలి పీల్చుకోగలిగాడు. చివరకు ఆ తిమింగలం సముద్రం ఉపరితలంపైకి వచ్చి దాని తలను విదిల్చి ఒక్కసారిగా మైఖేల్‌ను ఉమ్మేసింది. దీంతో అతడు బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. ఈ సంఘటన తర్వాత ఆస్పత్రిలో చేరిన మైఖేల్‌.. తిమింగలం తనను మింగిన విషయాన్ని చెప్పడంతో ఈ వార్త తెగ వైరల్‌ అవుతోంది. సాధారణంగా తిమింగలాలు చేపలను మింగేటప్పుడు నోరు తెరిచి చేపలతో పాటు నీటిని ఒక్కసారిగా మింగేస్తాయని తిమింగలాలపై అధ్యయనం చేసే జూకీ రాబిన్స్‌ వివరించారు. వీటి నోరు పెద్దగా ఉన్నప్పటికీ, గొంతు మాత్రం చిన్నగా ఉంటుందని, మనుషులను మింగేంత పెద్దగా ఉండకపోవడం వల్లే మైఖేల్‌ను మింగలేక ఉమ్మేసినట్లు తెలిపారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top