రేపే భూమికి అత్యంత సమీపంగా భారీ గ్రహశకలం.. మిస్సైల్‌ కంటే వేగంగా.. నాసా అలర్ట్‌

Huge asteroid to come terrifyingly close to Earth - Sakshi

వాషింగ్టన్‌: భూమికి సమీపంగా రోజూ ఎన్నో గ్రహశకలాలు వెళ్తుంటాయి. కొత్తవాటిన్నెంటినో గుర్తిస్తుంటారు కూడా. అయితే.. భూమికి అత్యంత సమీపంగా దూసుకొస్తున్న  ఆస్టరాయిడ్‌లను మాత్రం తేలికగా తీసుకోవద్దని సైంటిస్టులు చెబుతుంటారు. ఎందుకంటే వాటిలో ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి కాబట్టి. అలాగే.. ఇప్పుడూ భూమికి సమీపంగా వస్తున్న ఓ భారీ గ్రహశకలం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని నాసా హెచ్చరిస్తోంది.

ఆస్టరాయిడ్‌ 2022 వైజీ5.. భూమి వైపు దూసుకొస్తోందట. డిసెంబర్‌ 30వ తేదీన ఇది భూమికి సమీపంగా.. 3.1 మిలియన్‌ కిలోమీటర్ల దూరంతో ఇది ప్రయాణించనుందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమేనని నాసా హెచ్చరిస్తోంది. గంటకు 51,246 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని, ఈ వేగం ఒక హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయాణ వేగం కంటే ఐదు రేట్లు ఎక్కువని నాసా ప్రకటించింది. అయితే దీని వల్ల జరిగే నష్టతీవ్రత గురించి మాత్రం నాసా స్పష్టత ఇవ్వలేదు. విశేషం ఏంటంటే.. 

ఆస్టరాయిడ్‌ 2022 వైజీ5ను డిసెంబర్‌ 24 తేదీనే గుర్తించింది నాసా.  ఇది అపోలో గ్రూప్‌ గ్రహశకలాలకు చెందిందని,  సూర్యుడికి గరిష్టంగా 398 మిలియన్‌ కిలోమీటర్ల దూరం, కనిష్టంగా 119 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. 829 రోజులకు సూర్యుడి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసుకుంటుందని ప్రకటించింది.

అంతరిక్షం నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు, అందునా భూమిని ఢీ కొట్టే సంభావ్యత ఉన్న వాటిని దారి మళ్లించడం, లేదంటే అంతరిక్షంలోనే నాశనం చేసే ఉద్దేశ్యంతో ‘డార్ట్‌’​ పేరిట ప్రయోగం చేపట్టి.. విజయం సాధించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. అయితే..  ముందస్తు హెచ్చరికలు, సమయం ఉంటేనే దూసుకొచ్చే వాటిని ఢీ కొట్టడానికి స్పేస్‌షిప్‌లను ప్రయోగించడానికి వీలవుతుంది.

డార్ట్‌ బరువు 570 కేజీలు ఉంటుంది. వాస్తవానికి గ్రహశకలాలను, భూమి వైపు దూసుకొచ్చే మరేయితర వస్తువులను నాశనం చేయడం డార్ట్‌​ ఉద్దేశం కాదు.. కేవలం దారి మళ్లించడం మాత్రమే లక్ష్యం. కానీ, ప్రయోగంలో శకలాలు నాశనం అవ్వొచ్చని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. మరోవైపు చైనా కూడా గ్రహశకలాలను నుంచి తమ భూభాగాల్ని, ఉపగ్రహాల్ని.. అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని రక్షించుకునేందుకు సొంతంగా ఇలాంటి రక్షణ వ్యవస్థను సిద్ధంగా చేసుకుంటోంది. 2025లో ప్రయోగాత్మకంగా గ్రహశకలాల మళ్లింపును పరీక్షించాలని భావిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top