ఆత్మహత్యలేనా?

How The Mysterious Deaths Of Russian Celebrities - Sakshi

మిస్టరీగా రష్యా ప్రముఖుల మరణాలు

ఒడిశాలో 15 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు  

రష్యాకు చెందిన ప్రముఖులు అనుమానాస్పద రీతిలో మరణించడం సంచలనం రేపుతోంది. ఒకరో, ఇద్దరో మరణించారనుకుంటే ఏమో అనుకోవచ్చు. గత ఏడాది కాలంలో ఏకంగా 24 మంది మృత్యువాత పడడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించడానికి కాస్త ముందు నుంచే ఈ మిస్టరీ మరణాలు సంభవించడం గమనార్హం. ఇలా మరణించిన ప్రముఖుల్లో కొందరు పుతిన్‌ యుద్ధోన్మాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించినవారు ఉన్నారు. దీంతో పుతిన్‌ను ఎదిరిస్తే ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అన్న చర్చ కూడా జరుగుతోంది.  

భారత్‌లో 15 రోజుల్లో ముగ్గురు  
మన దేశంలోని ఒడిశా రాష్ట్రంలో గత పదిహేను రోజుల్లో ముగ్గురు రష్యన్లు ప్రాణాలు కోల్పోయారు. పారాదీప్‌ ఓడరేవులో ప్రయాణిస్తున్న నౌక సిబ్బందిలో ఒకరైన సెర్జీ మిల్యాకోవ్‌ (50) మంగళవారం తెల్లవారుజామున నౌకలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్‌ పోర్టు నుంచి పారాదీప్‌ మీదుగా ముంబై వెళుతున్న ఆ నౌకకి సెర్జీ చీఫ్‌ ఇంజనీర్‌.

తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన శవమై కనిపించారు. సెర్జీ గుండెపోటుతో మరణించారని నౌకా సిబ్బంది భావిస్తున్నారు. ఒడిశాలోని రాయగడ సాయి ఇంటర్నేషనల్‌ హోటల్‌లో ఇద్దరు రష్యన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ కొనసాగుతుండగానే  మరో మరణం సంభవించింది. రష్యా వ్యాపారి, ఎంపీ పావెల్‌ ఆంటోవ్‌ (65)డిసెంబర్‌ 24న హోటల్‌ గది కిటికీలో నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. అంతకు రెండు రోజుల ముందే డిసెంబర్‌ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమర్‌ బెడెనోవ్‌ (61) హోటల్‌ గదిలో అపస్మారక స్థితిలో కనిపించి ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా ప్రాణాలు విడిచారు.  

ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖులెవరు ?  
ప్రాణాలు కోల్పోతున్న రష్యన్లలో బిలయనీర్లు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు,  చమురు సంస్థల అధిపతులు, పెద్ద పెద్ద పదువుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, మిలటరీ నాయకులు ఉన్నారు. వీరిలో అత్యంత పిన్న వయస్కుడు 37 ఏళ్లు కాగా 73 ఏళ్ల వయసు వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. రష్యా యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్‌ఫ్రామ్‌ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ ట్యూల్కోవ్‌ అనుమానాస్పదరీతిలో మరణించారు.

యుద్ధాన్ని వ్యతిరేకించిన డాన్‌ రాపో పోర్ట్‌ గత ఆగస్టులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మన దేశంలో రాయగడలో మరణించిన ఎంపీ పావెల్‌ కూడా యుద్ధాన్ని వ్యతిరేకించినవారే.   ఆయన మరణించిన రోజే రష్యా నావికాదళానికి చెందిన అలెగ్జాండర్‌ బుజెకోవ్‌ కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మార్చిలో వాసిలీ మెల్నికోవ్‌ తన భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి శవమై కనిపించారు. జులైలో ప్రభుత్వ కాంట్రాక్టర్‌ యూరీ వోరోనోవ్‌ తన ఇంట్లో స్విమ్నింగ్‌పూల్‌లో రక్తపు మడుగులో శవమై తేలారు.  
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ఎలా మరణిస్తున్నారు ?  
రష్యా ప్రముఖులు మరణాల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నట్టు ప్రచారంలో ఉంది. ఎత్తయిన భవనాల మీద నుంచి, గదుల్లోని కిటికీల నుంచి, నౌకల నుంచి దూకడం, తమని తాము కాల్చుకోవడం,  గుండె పోట్లు వంటి ఘటనలతో మరణించడం ఎక్కువగా వెలుగులోకి వస్తోంది..లుక్‌ ఆయిల్‌ చైర్మన్‌ రావిల్‌ మాగ్నోవ్‌ గత సెప్టెంబర్‌లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి తన గది కిటికీ నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.

ఇలా మరణిస్తున్న వారిలో సంపన్నులే ఎక్కువ. వారి చుట్టూ అంగరక్షకులు ఉంటారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న అనారోగ్యం వచ్చినా అత్యుత్తమ వైద్య సేవలు తీసుకునే సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వారి మరణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ‘‘మరణిస్తున్న వారిలో అత్యధికులు కోట్లకు పడగలెత్తి రాజకీయ ప్రాబల్యం ఉన్నవారే.

వారు అసహజంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. పుతిన్‌ హయాంలో గత దశాబ్దకాలంగా విషప్రయోగాలతో చంపేయడం, హత్యాయత్నాలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. 2020లో ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే’’ అని రష్యాలో పొలిటికల్‌ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ జెఫ్రీ వింటర్స్‌ చెప్పారు.  

ఆర్థిక ఒత్తిళ్లు కారణమా ?  
ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో వ్యాపారాలు బాగా దెబ్బతిని బిలయనీర్లందరూ ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిన వారంతా  తమ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటాయన్న నమ్మకం లేని తీవ్రమైన నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతున్నారు.  ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం, ఆరోగ్యం క్షీణించి గుండెపోట్లు రావడం జరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో చమురు సంస్థలకు చెందిన  ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top