​Houthi Rebels: అమెరికా నౌకపై మిసైళ్లతో దాడి | Sakshi
Sakshi News home page

అమెరికా నౌకపై హౌతీల మిసైళ్ల దాడి

Published Sun, Feb 25 2024 9:53 AM

Houthis Missile Attack On America Oil Ship In Gulf Of Aden - Sakshi

సనా: యెమెన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో అమెరికాకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక ఎంవీ టార్మ్‌ థార్‌పై మిసైళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయిల్‌ ట్యాంకర్‌ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదు. నౌకలోని సిబ్బంది ఎవరికీ గాయాలవలేదు. నౌకపై దాడి విషయాన్ని హౌతీ మిలిటెంట్ల ప్రతినిధి సరియా వెల్లడించారు.

మరోవైపు ఈ విషయమై అమెరికా సెంట్రల్‌ కమాండ్‌(సెంట్‌కామ్‌) కూడా ఒక ప్రకటన చేసింది. తమ దేశానికి చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక లక్ష్యంగా హౌతీలు పేల్చిన యాంటీ షిప్‌ బాలిస్టిక్‌ మిసైళ్లను తమ  మిసైల్‌ డెస్ట్రాయర్ యూఎస్‌ఎస్‌ మాసన్‌ కూల్చివేసిందని సెంట్‌కామ్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆయిల్‌ ట్యాంకర్‌ ఎంవీ టార్మ్‌ థార్‌, యూఎస్‌ఎస్‌ మాసన్‌కు ఎలాంటి నష్టం జరగలేదని  వెల్లడించింది.

కాగా, గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్నయుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు మిసైళ్లు, డ్రోన్‌లతో గత నవంబర్‌ నుంచి దాడులు మొదలు పెట్టారు. తొలుత ఇజ్రాయెల్‌ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీ గ్రూపు తర్వాత అమెరికా, బ్రిటన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన నౌకలపైనా దాడులు చేస్తోంది.   

ఇదీ చదవండి.. రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు వెలికితీత

Advertisement
Advertisement