ఎగిరే ‘హోటల్‌’!

Hotel that never lands: Demo Of Sky Cruise With Guest Capacity of 5000 leaves - Sakshi

ఏమిటిది? చూస్తుంటే.. క్రూయిజ్‌షిప్‌ తరహాలో ఉన్న అతిభారీ విమానంలా ఉందే అనుకుంటున్నారా? మీ ఊహ కరక్టే.. ఇది ఆ రెండింటి కలబోతే! సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఎగిరే హోటల్‌ ‘స్కై క్రూయిజ్‌’ గ్రాఫిక్స్‌ నమూనా ఇది. విమానంలా ఎగిరే అనుభూతిని, విలాసవంతమైన ఓడలో లభించే సకల సౌకర్యాలను ప్రయాణికులకు ఏకకాలంలో అందించగల బాహుబలి తరహా విమానమన్నమాట. ఓస్‌ ఇంతేనా అనుకోకండి.. ఇందులోని ప్రత్యేకతల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 

ఆకాశంలో ఏళ్ల తరబడి ఎగురుతూ.. 
సాధారణంగా ఎంత భారీ విమానమైనా కొన్ని గంటలపాటు ప్రయాణించాక కిందకు దిగడం అనివార్యం. అలాగే నెలల తరబడి సముద్రంపై ప్రయాణించే క్రూయిజ్‌ షిప్‌లు సైతం ఎక్కడో ఒకచోట లంగరు వేయక తప్పదు. కానీ యెమెన్‌కు చెందిన ప్రముఖ సైన్స్‌ ఇంజనీర్‌ హషీమ్‌ అల్‌–ఘాయిలీ యూట్యూబ్‌లో స్కై క్రూయిజ్‌ పేరిట తాజాగా విడుదల చేసిన ‘ఎగిరే హోటల్‌’ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వీడియో నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

వేలాది మంది ప్రయాణికులతో ఆకాశంలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా ఎగరగలగడం దీని ప్రత్యేకతల్లో ఒకటి! పూర్తిగా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఎగిరే ఈ విమానంలో ఒకేసారి 5 వేల మంది అతిథులు ఆకాశయానం చేయొచ్చట!! ఇంత భారీ విమానం గాల్లో ఎగిరేందుకు వీలుగా అణు ఇంధనంతో నడిచే 20 ఇంజిన్లను దీనికోసం డిజైన్‌ చేశారు. ఇందుకోసం ఏకంగా ఓ చిన్నపాటి అణు రియాక్టర్‌నే ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

నియంత్రిత స్థాయిలో కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా అపరిమిత ఇంధనాన్ని ఈ విమానానికి సమకూర్చనున్నారు. దీంతో ఈ విమానం ఎప్పటికీ నేలపై వాలాల్సిన అవసరం రాదని డిజైనర్‌ చెబుతున్నాడు. మరి ప్రయాణికులు ఇందులోకి ఎలా ఎక్కి దిగగలరు అని అనుకుంటున్నారా? ఈ నూతన డిజైన్‌ ప్రకారం ప్రయాణికులను లేదా నిత్యావసరాలను సాధారణ వాణిజ్య విమానాలు లేదా ప్రైవేటు జెట్‌ల ద్వారా స్కై క్రూయిజ్‌ చెంతకు చేర్చి ప్రత్యేకమైన ‘లిఫ్ట్‌’ ద్వారా ఈ ఎగిరే హోటల్‌లోకి చేరుస్తారట!! విమానానికి చేపట్టే మరమ్మతులు సైతం గాల్లోనే నిర్వహిస్తారట! 

గాల్లోనే ప్రపంచమంతా.. 
ఈ విమానంలో ఉండబోయే సౌకర్యాలు అన్నీఇన్నీ కావు. ఇందులో ఒక భారీ షాపింగ్‌ మాల్, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్‌ సెంటర్లు, ప్లేగ్రౌండ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూళ్లు, వెడ్డింగ్‌ హాళ్లు, సమావేశ మందిరాలు ఉండేలా డిజైన్‌ చేశారు. ప్రత్యేకించి విమానం తోక భాగంలో ఉండే భారీ డెక్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో పైనున్న అంతరిక్షాన్ని, దిగువనున్న యావత్‌ ప్రపంచాన్ని అతిథులు వీక్షించే ఏర్పాటు ఉండనుంది.

విమానం మధ్య భాగం నుంచి లోపలకు వెలుతురు ప్రసరించేలా పూర్తిగా గ్లాస్‌ బాడీతో దీన్ని డిజైన్‌ చేయనున్నారు. విమానానికి ఇరువైపులా ఏర్పాటు చేసే బాల్కనీల తరహా డోమ్‌ల నుంచి అతిథులు చుక్కలను చూసే ఏర్పాటు సైతం ఉంది. అలాగే దట్టమైన మేఘాల్లోంచి ప్రయాణించే సమయంలో విమానం కుదుపులు లేదా కంపనాలకు గురయ్యే అవకాశం ఉంటే దాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి వాటిని నివారించేలా యాంటీ వైబ్రేషన్‌ టెక్నాలజీ సైతం ఈ క్రూయిజ్‌ క్రాఫ్ట్‌లో ఉండనుంది.

అంతా బాగానే ఉంది కానీ.. ప్రయాణికులు రోజుల తరబడి గాల్లో ప్రయాణించే క్రమంలో జెట్‌ల్యాగ్‌ తరహా అనారోగ్యానికి గురైతే ఎలా? ఈ డౌట్‌ విమానం డిజైనర్‌కు కూడా వచ్చింది. అందుకే ఇందులో ఒక అత్యాధునిక వైద్య కేంద్రాన్ని కూడా డిజైన్‌ చేశారు.     
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top