Garisenda Tower: వాలుతున్న వెయ్యేళ్ల టవర్‌

High alert in Italian town as leaning tower at risk of collapse - Sakshi

ఏ క్షణమైనా కుప్పకూలొచ్చు!

ఇటలీలో గుబులు రేపుతున్న మరో లీనింగ్‌ టవర్‌

ఎలాగైనా కాపాడేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు

కూలినా పరిసరాలకు నష్టం జరగకుండా బారికేడ్‌ నిర్మాణం

ఇటలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పీసా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత లీనింగ్‌ టవరే. నాలుగు డిగ్రీల కోణంలో ఒకవైపు వాలిపోయి అందరికీ ఆకట్టుకుంటూ కని్పస్తుందా కట్టడం. అయితే ఇటలీలోనే మరో లీనింగ్‌ టవర్‌ కూడా ఉంది. అది కూడా కాస్త అటూ ఇటుగా పీసా టవర్‌ అంత ఎత్తు ఉంటుంది. అలాంటి టవర్‌ కాస్తా ఇప్పుడు ఏ క్షణమైనా కుప్పకూలేలా కని్పస్తూ గుబులు రేపుతోంది....!

ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్‌ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్‌ మాదిరిగానే ఇది కూడా నానాటికీ ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. అలా ఈ టవర్‌ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్టు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్‌ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్‌ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందని ధ్రువీకరించింది.

అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్‌ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బారియర్‌ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్‌ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్‌ చుట్టూ మెటల్‌ రాక్‌ ఫాల్‌ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలినా పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నుంచి టవర్, దాని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ప్లాజాలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సందర్శనపై నిషేధం మరికొన్నేళ్ల దాకా (టవర్‌ కూలని పక్షంలో)
కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు.
బారియర్‌ నిర్మాణ వ్యయం 37 లక్షల పౌండ్లు(దాదాపు రూ.39.10 కోట్లు)గా అంచనా వేశారు. దీనికోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుండటం విశేషం! ‘‘నగరవాసులతో పాటు బొలోగ్నా నగరాన్ని, దాని ప్రఖ్యాత పర్యాటక చిహా్నలను కాపాడాలని తపిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులందరూ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి’’ అంటూ నగర కౌన్సిల్‌ పిలుపునిచి్చంది.

నిలబెట్టేందుకు తీవ్ర యత్నాలు
గారిసెండా టవర్‌ కూలిపోకుండా కాపాడేందుకు ఇటలీ శాయశక్తులా ప్రయతి్నస్తోంది. పీసా టవర్‌ కూడా క్రమంగా మరింత పక్కకు వాలి త్వరలో కూలిపోవడం ఖాయమని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నానా ప్రయత్నాలూ చేసి దాని ఒంపును కొంతమేర సరిచేసింది. ప్రస్తుతానికి అది కుప్పకూలే ముప్పు లేదని తేలి్చంది. అలా పీసా టవర్‌ను కాస్త సురక్షితంగా మార్చిన అనుభవాన్నంతా గారిసెండా విషయంలో రంగరిస్తున్నారు. ఇందుకోసం సివిల్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. తొలి దశలో దీన్ని వీలైనంత సురక్షితంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. సంబంధిత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

రెట్టింపు ఎత్తైన జంట టవర్‌
గారిసెండా నిజానికి బొలోగ్నా నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంట టవర్లలో ఒకటి మాత్రమే! పైగా చిన్నది. ఎందుకంటే, దీని పక్కనే ఉన్న అసినెల్లీ టవర్‌ దీనికంటే దాదాపు రెట్టింపు పొడవైంది! అంటే దాదాపు 90 మీటర్లన్నమాట. ప్రఖ్యాత పీసా టవర్‌ ఎత్తు 56 మీటర్లే. అంటే, ఇది పీసాను తలదన్నేంత ఎత్తుందన్నమాట! అసినెల్లీ టవర్‌ నిర్మాణం గారిసెండా తర్వాత పదేళ్లకే, అంటే 1,119లో జరిగింది. ఇది కూడా కాస్త పక్కకు ఒరిగే ఉండటం విశేషం. అయితే ఆ ఒంపు మరీ పీసా, గారిసెండా అంతగా లేదు గనుక ప్రస్తుతానికి దీనికి వచి్చన ముప్పేమీ లేనట్టే!

దాదాపు వెయ్యేళ్ల నాటిది!
► గారిసెండా టవర్‌ ఇప్పటిది కాదు. మధ్య యుగానికి చెందినది.
►దీన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం, అంటే క్రీస్తుశకం 1,109 సంవత్సరంలో నిర్మించారు.  
►టవర్‌ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు (154 అడుగులు).
►నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది.
►200 ఏళ్లకే టవర్‌ ఒక పక్కకు ఒరగడం మొదలైంది.
►దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తును బాగా తగ్గించారు.
►డాంటే 1321 సంవత్సరంలో ముగించిన అజరామర పద్య కావ్యం ‘ది డివైన్‌ కామెడీ’లో కూడా గారిసెండా టవర్‌ ప్రస్తావన ఉంది.

 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top