ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకోగా, వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్‌లు పాకిస్తాన్ బయల్దేరారు. మరోవైపు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. అలాగే, ఇరాన్ యుద్ధంపై ఈజిప్టు, పాక్ అధికారులు చర్చించారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య మరో విడత చర్చలు ప్రారంభించే ప్రయత్నాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు.
ఈ క్రమంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ప్రపంచానికి పెద్ద బహుమతి అని చెప్పుకొచ్చారు. అలాగే, ఇరాన్ సముద్ర రవాణాపై అమెరికా దిగ్బంధనం అవసరమైనంత కాలం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక వైఖరి బలహీనపడిందని, సముద్రంలో క్రమరహిత వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడుతోందన్నారు. అవసరమైనంత కాలం ఒత్తిడిని కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దెబ్బతిన్న ఇరాన్ సైన్యం, ప్రత్యేకించి ఐఆర్‌జీసీ సముద్రపు దొంగల ముఠాగా మారిపోయిందని తెలిపారు. విచక్షణారహితంగా మందుపాతరలు పాతేది, యాదృచ్ఛికంగా ఓడలపై కాల్పులు జరిపేది, కొన్ని వారాల వ్యవధిలో 45,000 మంది తమ సొంత ప్రజలను అమాయక నిరసనకారులను చంపింది వారేనని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అనుమానాస్పద డ్రగ్స్ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యూఎస్ సదరన్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టు ఉంది. స్మగ్లింగ్ మార్గాల్లో వెళ్తున్న డ్రగ్స్ సరఫరాదారులనే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది.
ఇరాన్ కౌంటర్..
అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు వరకు ఇజ్రాయెల్ గగనతలంపై తాము పూర్తి పట్టును సాధించామని ఇరాన్ రక్షణశాఖ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ రజా తలాయీ నైక్ వెల్లడించారు. దాడులు చేసేందుకు మరిన్ని అధునాతన ఆయుధాలు ఇరాన్ అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఇరాన్ స్వయంగా అధునాతన ఆయుధాలను తయారుచేస్తోందని, ఇదే పేర్కొన్నారు.


