కేంద్రంలోని అధికార బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం పొలిటికల్ గేమ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే బీహార్ రాజకీయాల్లో బీజేపీకి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అటు బెంగాల్‌లో కూడా విజయం బీజేపీదేనని కాషాయ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, తదుపరి బీజేపీ టార్గెట్ పంజాబ్ అనే వార్తలు జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా పలువురు నేతల చేరికలు అనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే బీజేపీ అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరి పంజాబ్‌లో బీజేపీకి అధికారం అంత సులువు కాదనే విషయాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు.
బీహార్‌లో సంబరాలు జరుగుతుండగా గంగానది బీహార్ నుండి బెంగాల్‌కు ప్రవహిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించి.. తదుపరి ఎన్నికల పోరుకు సంకేతం ఇచ్చారు. ఇప్పుడు, బెంగాల్ దంగల్ ముగియక ముందే పంజాబ్ యుద్ధం మొదలైంది. బీజేపీ ఎన్నికల రథం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్న సంకేతాలిస్తూ.. పంజాబ్‌లో 2027 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలపై కాషాయ దళం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ పొలిటికల్ గేమ్‌లో భాగంగా పంజాబ్ రాజకీయాల్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఎంపీలు రాఘవ్ చద్దా, పంజాబ్‌కు చెందిన మరో ఐదుగురు ఎంపీలు బీజేపీలో చేరడం ఈ విషయాన్నే సూచిస్తుంది.
బీజేపీ సమస్య..
అయితే, పంజాబ్‌లో బీజేపీ ఎన్నడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. పంజాబ్‌లో బీజేపీకి స్థానిక నాయకుల కొరత ఉంది. పంజాబ్‌లో బీజేపీకి ప్రధాన సవాళ్లు స్థానిక నాయకత్వం లోపం, సిక్కు రైతు వర్గం నమ్మకం పొందడం. అలాగే, దశాబ్దాలుగా శిరోమణి అకాలీ దళ్ (SAD)కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. వ్యవసాయ బిల్లుల విషయంలో 2020లో విడిపోవడానికి ముందు శిరోమణి.. బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి అధికారం కావాలంటే దానికి రాష్ట్రంతో సంబంధం ఉన్న నాయకులు అవసరం. ప్రస్తుతం పంజాబ్‌లో బీజేపీకి ఉన్న ఏకైక ప్రముఖ నాయకుడు రవ్‌నీత్ సింగ్ బిట్టు. ఆయన కాంగ్రెస్ నుండి పార్టీలోకి మారారు. దీంతో, పాత నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య విభేదాలు, వ్యూహాత్మక గందరగోళం నెలకొంది.
అవకాశాలు..
మరోవైపు.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే మరి కొందరు కీలక నేతలు కావాల్సిందే. ఈ విషయంలోనే ఆప్ నుండి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, ఇతర ఎంపీల పాత్ర పంజాబ్‌లో బీజేపీకి ఎంతో కీలకం కానుంది. ఎంపీలు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, విక్రమ్ సాహ్నే వంటి ప్రముఖులు బీజేపీలో చేరడం ఆమ్ ఆద్మీ పార్టీలో విభజనను చూపిస్తోంది. దీంతో, బీజేపీకి కొత్త ఓటర్లను ఆకర్షించే అవకాశం ఏర్పడింది. రాఘవ్ చద్దా వంటి యువ నాయకులు బీజేపీకి పట్టణ, చదువుకున్న, మధ్యతరగతి ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అకాళీదళ్ బలహీనతతో సిక్కు మతపరమైన ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లే చాన్స్ కూడా ఉంది. ఇదిలా ఉండగా.. పట్టణ హిందూ ఓటర్లలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడం బీజేపీకి ప్రధానంగా లాభం కావచ్చు.
బీజేపీ వ్యూహాలు..
రైతు వర్గం నమ్మకం పొందడం బీజేపీకి అత్యవసరం. వ్యవసాయ చట్టాలపై నిరసనల తర్వాత బీజేపీపై రైతు వర్గంలో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ఇచ్చే విధానాలు, ఎంఎస్‌పీ హామీలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బీజేపీ హామీ ఇస్తే అది పార్టీకి మైలేజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఎంపీల చేరిక కూడా బీజేపీకి ప్లస్ కాగా.. అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీలకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
గత ఫలితాలు..
పంజాబ్‌లో 2022లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో 117 అసెంబ్లీలో 92 స్థానాలు గెలిచి, పంజాబ్‌లో తొలిసారి పూర్తి మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. ఇదే సమయంలో శిరోమణి అకాళీదల్ 15 నుంచి 3 స్థానాలకు పడిపోయింది. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.


