నాన్న స్వార్థపరులు అనిపించింది.. ఎందుకంటే!

He Loves WIfe So Much Hold Hand What Happened After She Lost Breath - Sakshi

నెటిజన్లను ఆకర్షిస్తున్న ప్రేమకథ

పెళ్లినాటి ప్రమాణాలను మనసా, వాచా, కర్మణా ఆచరించే భర్తలు కొంతమందే ఉంటారు. పుట్టింటిని వీడి మెట్టినింట అడుగుపెట్టిన ‘ఆడపిల్ల’కు అన్ని బంధాలు తానే అయి ప్రేమానురాగాలు పంచుతారు. తండ్రిలా బాధ్యతగా వ్యవహరిస్తూ, తల్లిలా ఆప్యాయత కురిపిస్తూ, స్నేహితుడిలా తోడుంటూ, భర్తగా మనసెరిగి ప్రవర్తిస్తూ భార్య పట్ల అవాజ్యమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ఇంతలా ప్రేమించే భర్త ఉంటే ఏ అమ్మాయి అయినా తనను తాను అదృష్టవంతురాలిగానే భావిస్తుంది. అంతేకాదు తాను పొందిన ప్రేమకు పదిరెట్లు ఎక్కువగానే ప్రేమను తిరిగి ఇస్తుంది. అలాంటి ఓ జంట కథ గురించి వారి కూతురు చెప్పిన విషయాలు వింటే కళ్లు చెమర్చకమానవు. ఒకరికొకరై బతికిన ఆ దంపతులు కొన్ని రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయిన వైనం నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.  

న్యూయార్క్‌: ‘‘మా నాన్నకు ఐదుగురు కూతుళ్లం. బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లొచ్చినపుడు వెంటనే మేమంతా ఆయనకు ముద్దు పెట్టేందుకు వరుసలో నిలబడే వాళ్లం. కానీ నాన్న మాత్రం ముందుగా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె నుదుటిపై ముద్దుపెట్టేవారు. ఎందుకంటే మా నాన్న ఫస్ట్‌ లవ్‌ తనే కదా. అంతేకాదు మేం సరాదాగా రోడ్‌ ట్రిప్‌కు వెళ్లినపుడు గానీ, కుటుంబమంతా ఒక్కచోట చేరి కచేరీలు చేసినప్పుడు గానీ పాటల రూపంలో ఆమెపై ప్రేమను చాటుకునే వారు. అంతా మామూలు పాటలు పాడితే.. నాన్న మాత్రం పాతకాలం నాటి, బాలీవుడ్‌ రొమాంటిక్‌ సాంగ్స్‌ ఆలపించేవారు. అమ్మను చూస్తూ ఆరాధనా భావం వ్యక్తం చేసేవారు. 

అయితే మా సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం నాన్న ప్రేమ అందరికీ కాస్త వింతగా తోచేది. అయినా ఆయనెప్పుడూ వెనకడుగు వేయలేదు. అమ్మ కూడా అంతే నాన్నకు తగ్గట్టుగా నడుచుకునేది. ఆయనకు నచ్చినట్లే తన కట్టూబొట్టూ ఉండేది. తను అనారోగ్యం పాలైనపుడు కూడా నాన్న బెంగ పెట్టుకోకూడదనే ఉద్దేశంతో అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తించేది. అమ్మకు బ్రెయిన్‌లో ట్యూమర్‌ వచ్చిన తర్వాత అనేక సర్జరీలు జరిగాయి. దాంతో రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణించసాగింది. సరిగ్గా నడవలేకపోయేది. (చదవండి: భార్య ప్రేమ కోసం సైకిల్‌ మీద ఖండాంతరాలు దాటి..)

అప్పుడు నాన్నే తనకు ఊతకర్ర అయ్యారు. అమ్మను చేయి పట్టుకుని నడిపించేవారు. తనే బెడ్‌ పక్కనే కూర్చుని, సేవలు చేస్తూ.. గొంతు తడి ఆరేంత వరకు ఖురాన్‌ పటించేవారు. అమ్మ చివరి క్షణాల్లోనూ ఆయన తన పక్కనే ఉన్నారు. ‘‘ నువ్వెప్పుడూ ఒంటిరివి కావు. నేను నీతోనే వస్తున్నా’’అని అమ్మ చేతిలో చేయి వేసి మాట ఇచ్చారు. ఇదంతా చూస్తున్న నాకు నాన్న చాలా స్వార్థపరులు అనిపించింది. కోపం కూడా వచ్చింది. అంటే అమ్మ వెళ్లిపోయినా మేమంతా బతికి ఉన్నా విలువ లేదా అనిపించింది. నిజానికి అమ్మ మీద నాన్నకు ఉన్న ప్రేమ ఎలాంటిదంటే... అమ్మ చనిపోయిన తర్వాతి రోజే ఆయన తన సమాధి కోసం ప్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. అమ్మ పక్కనే శాశ్వతంగా నిద్రించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. (చదవండి: నెటిజన్లను ఫిదా చేస్తున్న లవ్‌స్టోరి!)

పేపర్‌ వర్క్‌ పూర్తైన తర్వాత రెండు రోజుల పాటు ఎంతో గంభీరంగా కనిపించారు. ఆ మరుసటి రోజే.. ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. షూ లేసులు కట్టుకుంటూ నేలమీద పడిపోయారు. అయినా ఆయనలో ఎలాంటి ఆందోళన, బాధ కనిపించలేదు. అంబులెన్స్‌ వచ్చే సమయానికే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. బహుశా అమ్మను చేరుకుని ఉంటారు’’అంటూ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’ ఫేస్‌బుక్‌ పేజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల అనుబందం గురించి సదరు మహిళ చెప్పుకొచ్చారు. అయితే తమ పేర్లు, పూర్తి వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. కేవలం వారి ఫొటోలను మాత్రం షేర్‌ చేశారు.

ఈ క్రమంలో దివంగత దంపతుల లవ్‌స్టోరీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్లే నేటి ఆధునిక యువతకు వీరి బంధం ఆదర్శప్రాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాకుండా అంతటి గొప్ప ప్రేమజంటకు కూతురిగా జన్మించినందుకు మీరు అదృష్టవంతురాలు అని వారి కుమార్తెను అభినందిస్తున్నారు. వీళ్ల కథ వింటే.. నిజమైన ప్రేమికులను ఆ చావు కూడా విడదీయలేదు అనే మాట నిజమే అనిపిస్తోంది కదా!!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top