భార్య ప్రేమ కోసం సైకిల్‌ మీద ఖండాంతరాలు దాటి..

Who is Dr PK Mahanandi How His Story Inspires Us - Sakshi

పేదింటి కుర్రాడు- కోటలోని యువరాణి తరహా సినిమాను తలపించే ప్రేమకథ

నిజమైన ప్రేమ ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తుందని నిరూపించారు డాక్టర్‌ ప్రద్యుమ్న కుమార్‌ మహానందియా. భార్య కోసం సైకిల్‌ మీద ప్రయాణం చేస్తూ ఖండాంతరాలు దాటి ఆమెను శాశ్వతంగా తన సొంతం చేసుకున్నారు. అన్నీ తానై ముందుకు నడిపే అర్ధాంగి, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలతో హాయిగా కుటుంబ జీవితం గడుపుతున్నారు. చిత్రకారుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్వీడన్‌ ప్రభుత్వంలో సాంస్కృతిగా సలహాదారుగా ఉన్నారు. ‘ఎక్కడి ఒడిశా.. ఎక్కడి స్వీడన్’‌.. ‘బాల్యంలో ఎదుర్కొన్న అవమానాలు చాలు.. మళ్లీ విదేశాల్లో కూడానా!?’ అని ఏమాత్రం వెనకడుగు వేసినా ఆయన జీవన ప్రయాణంలో బహుశా ఇన్ని మధుర జ్ఞాపకాలు ఉండేవి కావేమో. 

ఒడిశా అబ్బాయి- స్వీడన్‌ అమ్మాయి ప్రేమ, పెళ్లి కథ. పాత స్టోరీయే. అయితే పాత విషయాన్నైనా ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ స్పూర్తిని నింపే సోషల్‌ మీడియా వీరులు పీకే మహానందియా కథను మరోసారి తెరపైకి తెచ్చారు. ‘పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. అలుపెరుగక కృషి చేస్తే లక్ష్యాన్ని ఛేదించవచ్చు.. ఇదిగో ఇందుకు ఈయనే కథే ఉదాహరణ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘పేదింటి కుర్రాడు- కోటలోని యువరాణి’ తరహా సినిమాను తలపించే ఈ కథను మనం కూడా ఓసారి గుర్తు చేసుకుందాం!

ఎవరీ పీకే మహానందియా?
ఒడిశాలోని ఓ నిరుపేద కుటుంబంలో 1949లో పీకే మహానందియా జన్మించారు. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమాజపు విపరీత పోకడలు, కుల వ్యవస్థ కారణంగా చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు పడ్డారు. ఉన్నత విద్యనభ్యసించే ఆర్థిక స్థోమత లేకపోయినా.. దేవుడు తనకు ప్రసాదించిన కళతో చిత్రకారుడిగా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 1971లో న్యూఢిల్లీలోని ఓ కాలేజీలో చేరి చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించారు. రష్యన్‌ కాస్మోనాట్‌ వాలంటీనా తెరిష్కోవా, భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ వంటి ప్రముఖుల చిత్రాలు గీసి పేరు సంపాదించారు. ఇలా మహానందియా జీవితం సాగుతున్న వేళ.. 1975లో ఓ పందొమిదేళ్ల స్వీడన్‌ అమ్మాయి.. చార్లెట్‌ వన్‌ స్లెవిన్‌ ఇండియాకు వచ్చింది. మహానందియా ఆర్ట్‌ గురించి తెలుసుకుని ఆయన చేత తన బొమ్మ గీయించుకోవాలని ఆశపడింది. (ఇర్ఫాన్‌, సుతాప అపూర్వ ప్రేమకథ)

పెళ్లైన తర్వాత  ప్రేమికులుగా..
ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన ప్రణయ బంధం పెళ్లికి దారి తీసింది. మహానందియాపై ఉన్న అవాజ్యమైన ప్రేమతో చారులతగా పేరు మార్చుకున్న చార్లెట్‌ భారత సంప్రదాయ ప్రకారం అతడిని వివాహమాడారు. ఆ తర్వాత తన చదువు పూర్తి చేసేందుకు స్వస్థలానికి పయనమయ్యారు. భర్తను కూడా తనతో రావాల్సిందిగా కోరారు. అయితే అప్పటికింకా మహానందియా కోర్సు పూర్తి కాకపోవడంతో ఆయన ఇక్కడే ఉండిపోయారు. అనంతరం చార్లెట్‌ తనను చేరుకునేందుకు ఫ్లైట్‌ టికెట్లు పంపినా.. మహానందియా వాటిని సున్నితంగా తిరస్కరించారు. తన సొంత డబ్బుతోనే అక్కడికి వస్తానంటూ భార్యకు నచ్చజెప్పారు. ఇలా కొన్నాళ్లపాటు వీరిద్దరు ప్రేమలేఖలు రాసుకుంటూ పెళ్లి తర్వాత కూడా ప్రేమికులుగా మధురానుభూతులు సొంతం చేసుకున్నారు. (కోవిడ్‌–19 లవ్‌స్టోరీ: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి)

సరిహద్దులు చెరిపేస్తూ.. ప్రేమ కోసమై
అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ తన కోసం ఖండాంతరాల ఆవల ఎంతగానో ఎదురుచూస్తున్న భార్యను బాధపెట్టడం మహానందియాకు కష్టంగా తోచింది. సరిపడా డబ్బు చేతికి రాకపోవడంతో తన వస్తువులన్నీ అమ్మేసి.. ఓ పాత సైకిల్‌ కొన్నారు. పెయింటింగ్‌ బ్రష్‌లు, తాను గీసిన పెయింటింగ్‌లు వెంటేసుకుని 1978లో యూరప్‌కు పయనమయ్యారు. న్యూఢిల్లీ నుంచి అమృత్‌సర్‌ మీదుగా అఫ్గనిస్తాన్‌, ఇరాన్‌, టర్కీ, బల్గేరియా, యుకోస్లేవియా, జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్‌ గుండా ఎట్టకేలకు స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌కు చేరుకున్నారు. దాదాపు 4 నుంచి ఐదు నెలల పాటు సాగిన ఈ సైకిల్‌ ప్రయాణం (అప్పటికింకా చాలా దేశాల్లో వీసా నిబంధనలు అమల్లోకి రాలేదు) మహానందియా పడని కష్టం లేదు. భార్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నిద్రాహారాలు కరువైనా ఆయన లెక్కచేయలేదు. 

నమ్మే ప్రసక్తే లేదు.. స్వీకరిస్తుందా? లేదా?
యూరప్‌లోని రాచ కుటుంబ మూలాలు గల విద్యాధికురాలైన ఓ యువతి.. భారతదేశంలోని ఓ పేదవాడిని ప్రేమించి, పెళ్లి చేసుకుందంటే ఎవరికైనా అనుమానం కలగడం సహజమే. భారత్‌ నుంచి సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడు ఈ మాటలు చెబుతుంటే స్వీడన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కూడా తొలుత ఇలాగే సందేహపడ్డారు. వాళ్లలా అడ్డగించిన తర్వాత మహానందియా ఒక్కసారి తత్తరపాటుకు లోనయ్యారు. అవును.. నిజంగానే నా భార్య నన్ను స్వీకరించకుండా ఉండదు కదా అని కాస్త మదనపడ్డారు. 

అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ చార్లెట్‌ అలియాస్‌ చారులత మహానందియా ఉన్న చోటుకు వచ్చారు. ఆనంద భాష్పాలతో తన భర్తకు స్వాగతం పలికి తన తల్లిదండ్రులకు పరిచయం చేశారు. కూతురి ప్రేమ, అల్లుడి గొప్పతనం అర్థం చేసుకున్న ఆమె కుటుంబ సభ్యులు శ్వేతజాతీయేతర వ్యక్తిని కుటుంబంలోకి ఆహ్వానించకూడదనే నిబంధనను పక్కన పెట్టి మరీ మహానందియాను అక్కున చేర్చుకున్నారు. తమ సమక్షంలో వారిద్దరికి మరోసారి పెళ్లి చేశారు. అలా వారి ప్రేమకథ సుఖాంతమైంది.

ఎక్కడ అవమానించారో.. అక్కడే సగర్వంగా..
ఒకప్పుడు అంటరానివాడుగా తనను వెలేసిన ఊరే.. ఆర్టిస్టుగా మహానందియా ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత గౌరవ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికింది. ఒడియా సాంస్కృతిక రాయబారిగా, స్వీడన్‌ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా సేవలు అందించిన తమ ఊరి బిడ్డ విజయాన్ని ఆస్వాదిస్తూ హర్షధ్వానాలు చేసింది. ప్రపంచంలోని ప్రఖ్యాత నగరాలన్నింటిలో తన పెయింటింగ్‌లను ప్రదర్శిస్తూ, యూనిసెఫ్‌ ప్రశంసలు దక్కించుకున్న మహానందియా.. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గల ఉత్కళ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కల్చర్‌ 2012లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసి సత్కరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top