మక్కాలో సామాజిక దూరం పాటిస్తోన్న యాత్రికులు

Hajj Pilgrims Social Distancing as They Circle Around Kaaba in Mecca - Sakshi

రియాధ్‌: కరోనా వైరస్‌ మన జీవితాలను తారుమారు చేసింది. ఓ పండగ లేదు.. వేడుక లేదు. కనీసం ఎవరైనా మరణిస్తే.. చూడ్డానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్లేస్‌లలో లాక్‌డౌన్‌ విధించాయి. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం లేదు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా మక్కా వెళ్లాలనుకుంటాడు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా హజ్‌ యాత్రకు అటంకం ఏర్పడింది. ఈ ఏడాది మక్కా దర్శనానికి కేవలం సౌదీ అరేబియాలో ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఏటా దాదాపు 2.5 మిలయన్ల మంది మక్కాను దర్శించుకుంటుండగా ఈ ఏడాది వీరి సంఖ్య కేవలం 10 వేలకు మాత్రమే పరిమితమయినట్లు అల్‌ జజీరా తెలిపింది. వీరిని కూడా 50 మంది చొప్పున మాత్రమే కాబా దర్శనానికి అనుమతిస్తోన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. కాబా చుట్టు తిరగాలని ఆదేశించింది. (హజ్‌ యాత్రపై కోవిడ్‌ ప్రభావం)

ఈ క్రమంలో ప్రస్తుతం మక్కాలోని పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను మహ్మద్‌ అలీ హరిస్సి అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ‘ఈ రోజు మక్కాలో కనిపించిన నమ్మశక్యం కానీ దృశ్యాలు.. కరోనా హజ్‌ యత్రపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇవి చూస్తే అర్థమవుతోంది’ అంటూ షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటల్లో యాత్రికులంతా రంగురంగుల గొడుగులు పట్టుకుని.. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కాబా చుట్టూ తిరుగుతున్నారు. వీరందరిని ఓ వైద్యుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాక ప్రతి రోజు ఈ మసీదును శుభ్రం చేయడానికి దాదాపు 35 వేల మంది పని చేస్తున్నారని తెలిపింది. మసీదును శానిటైజ్‌ చేయడం కోసం 54 వేల లీటర్ల క్రిమి సంహారక మందును, 1050 లీటర్ల ఎయిర్‌ ఫ్రెషనర్‌ని వినియోగిస్తున్నట్లు తెలిపింది. (క‌న్నీళ్లు పెట్టుకున్న డాక్ట‌ర్‌)

గతంలో రోజుకు రెండు, మూడు సార్లు మసీదును శుభ్రం చేస్తుండగా.. ప్రస్తుతం పది సార్లు క్లీన్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణంగా 40 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్‌ యాత్ర చేయాలన్నది నిర్దేశం. కరోనా నేపథ్యంలో ఈసారి యాత్ర జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top