గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్ | Gripen fighter jets escort PM Narendra Modi into Sweden | Sakshi
Sakshi News home page

గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్

May 17 2026 8:50 PM | Updated on May 17 2026 9:30 PM

 Gripen fighter jets escort PM Narendra Modi into Sweden

గోతెన్‌బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.

గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.

ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్‌వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్‌లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.

స్వీడన్‌లో 2 రోజుల పర్యటన 
స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్‌లో పర్యటిస్తున్నారు.

ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్ దేశాలు ఉంటాయి.

“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.

ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్‌, స్వీడన్‌ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.

ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్‌లో ప్రముఖ దేశంగా స్వీడన్‌కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement