ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట

Genome data sheds light on how Homo sapiens arose in Africa - Sakshi

కనీసం రెండు ఆదిమ జాతుల నుంచి పుట్టుకొచ్చాం..

10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలోని భిన్న ప్రాంతాల్లో మూలాలు

ఆధునిక మానవుని పుట్టుకపై కొత్త అధ్యయనం వాదన

ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు
ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం..

మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్‌గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్‌ నేచర్‌లో ప్రచురించారు.

‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్‌ డాక్టర్‌ బ్రెన్నా హెన్‌ వివరించారు.

ఆ ఆధారాలే  ఉంటేనా...!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్‌–మాడిసన్‌ వర్సిటీ పాపులేషన్‌ జెనెటిసిస్ట్‌ ఆరన్‌ రాగ్స్‌డేల్‌ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక
మానవుని (హోమోసెపియన్‌) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన.

ఇలా చేశారు...
డాక్టర్‌ హెన్‌ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్‌ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్‌లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్‌ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్‌ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా సిమ్యులేషన్‌ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు.

ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్‌ఏను బ్రిటిష్‌ వారి డీఎన్‌ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్‌ మానవుని డీఎన్‌ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్‌ హెన్‌ సూత్రీకరించారు. వాటికి స్టెమ్‌1, స్టెమ్‌2గా పేరు పెట్టారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top