500 కోట్ల టీకా డోసులు

G20 Summit: PM Narendra Modi participates in session on Global Economy and Global Health - Sakshi

2022 చివరినాటికల్లా ఉత్పత్తి చేయడానికి సిద్ధం 

కరోనాపై పోరాటంలో ప్రపంచానికి సహకరిస్తాం

వన్‌ ఎర్త్, వన్‌ హెల్త్‌.. మన సంకల్పం కావాలి

జి–20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

రోమ్‌:  వచ్చే ఏడాది చివరి నాటికల్లా 500 కోట్లకుపైగా కోవిడ్‌–19 టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తమ దేశంతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచానికి భారత్‌ తనవంతు సాయం కచ్చితంగా అందిస్తుందని తెలిపారు.

తమ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ  చేశామని గుర్తుచేశారు. ఆయన శనివారం రోమ్‌లో ప్రారంభమైన జి–20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సులో ‘గ్లోబల్‌ ఎకానమీ, గ్లోబల్‌ హెల్త్‌’ అంశంపై మాట్లాడారు. కరోనాపై పోరులో భారత్‌ పోషిస్తున్న పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో నిబంధనలను మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఒక యంత్రాంగం ఉండాలని సూచించారు. భారత్‌లో దేశీయంగానే అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జి న్‌’కు అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వద్ద పెండింగ్‌లో ఉందని మోదీ గుర్తుచేశారు. త్వరగా అనుమతి లభిస్తే ఇతర దేశాలకు టీకాల విషయంలో సాయం చేసేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో భారత్‌ నుంచి 150 దేశాలకు అవసరమైన అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు పంపించామని వివరించారు.

సాహసోపేత ఆర్థిక సంస్కరణలు
కనిష్ట కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను శ్రీకారం చుట్టామన్నారు. కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే అన్ని దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంతోపాటు ఆరోగ్య రంగంలో భవిష్యత్తుల్లో తలెత్తబోయే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారు. ఈ దిశగా ‘వన్‌ ఎర్త్, వన్‌ హెల్త్‌’ అనే సంకల్పాన్ని తీసుకోవాలని కోరారు. రోమ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమాల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ శ్రింగ్లా మీడియాకు తెలియజేశారు.

పేద దేశాలకు మరిన్ని టీకాలు: ఇటలీ ప్రధాని
ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జి–20 శిఖరాగ్ర సదస్సు శనివారం ఇటలీ రాజధాని రోమ్‌లోని నువొలా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యింది. అతిథ్య దేశం ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ప్రారంభోపన్యాసం చేశారు. జి–20 దేశాల అధినేతలకు స్వాగతం పలికారు.

పేద దేశాలకు కోవిడ్‌–19 వ్యాక్సిన్లు  మరిన్ని అందించాలని జి–20 సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా టీకాల పంపిణీ విషయంలో ధనిక దేశాలు, పేద దేశాల మధ్య అంతరం నైతికంగా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ఇప్పటివరకు కేవలం 3 శాతం మందికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ జరిగిందని గుర్తుచేశారు. ఇక ధనిక దేశాల్లో 70 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారని తెలిపారు.

తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. శిఖరాగ్ర సదస్సులో తొలిరోజు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక రంగాలపై చర్చించారు. ఈ సదస్సు ఆదివారం కూడా కొనసాగనుంది. సోమవారం నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top