
ఫ్రాన్స్: అమెరికా రాయబారి చార్లెస్ కుష్నర్‌కు ఫ్రాన్స్ సమన్లు జారీ చేసింది. యూదు వ్యతిరేకత పెరుగుదలను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలను విదేశాంగ శాఖ తోసి పుచ్చింది. కుష్నర్ వ్యాఖ్యలు ఆమోదయోగం కాదని పేర్కొంది. రాయబారులు తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోమని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జారెడ్ కుష్నర్ తండ్రి చార్లెస్ కుష్నర్‌ను ప్రాన్స్ రాయబారిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌కు బహిరంగ లేఖ రాశారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్‌లో యూదుల పట్ల ద్వేషం పెల్లుబుకిందని కుష్నర్ ఆరోపించారు.
ఇజ్రాయెల్‌పై తన విమర్శలను తగ్గించుకోవాలని మాక్రాన్‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఫ్రాన్స్ వీధుల్లో యూదులపై దాడి జరగకుండా, యూదుల ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, యూదుల వ్యాపారాలు ధ్వంసం చేయకుండా ఒక్క రోజు కూడా లేదన్నారు.
ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళికను రూపొందించాలని, అందుకు మాక్రాన్, ఇతర ఫ్రెంచ్ నాయకులతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కుష్నర్ లేఖ... పాలస్తీనాకు గుర్తింపునివ్వడం యూదు వ్యతిరేకతకు దోహదపడుతోందంటూ మాక్రాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించింది. కాగా, సెపె్టంబర్‌లో పాలస్తీనాను అధికారికంగా గుర్తించాలన్న యోచనలో ఫ్రాన్స్ ఉంది.