SpaceBok: మార్స్‌ జీవం గుట్టు తేల్చే రోబో

Four Legged SpaceBok Robot Set For Mars And How To Walk On It - Sakshi

మన భూమ్మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా? ఇంతకుముందైనా ఉండేదా..? చాలా కాలంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఈ ఆసక్తితోనే సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల వద్దకు శాటిలైట్లను పంపుతున్నారు. ముఖ్యంగా భూమిని పోలి ఉన్న అంగారక (మార్స్‌) గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడకు రోవర్లను పంపారు. తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?

ఏమిటీ రోబో.. ఎందుకీ ప్రయోగం?
ఇప్పటికే అంగారకుడిపైకి పలుమార్లు రోవర్లను పంపారు. చిన్న కారు పరిమాణంలో ఉండి చక్రాలతో కదులుతూ పరిశోధనలు చేసే ఈ రోవర్లకు చాలా పరిమితులు ఉన్నాయి. అవి కదిలే వేగం చాలా తక్కువ, రాళ్లురప్పలు, ఇసుక వంటివి ఉంటే ముందుకు ప్రయాణించలేవు. ఎత్తైన చోట్లకు వెళ్లడం కష్టం. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్‌జ్యూరిచ్, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల బృందం ‘స్పేస్‌బాక్‌’పేరుతో నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేకమైన రోబోను రూపొందించింది. అంగారకుడిపై జీవం ఉనికిని గుర్తించేందుకు దీనిని త్వరలోనే పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి చంద్రుడిపై పరిశోధనల కోసం ఈ రోబోను రూపొందించారు. తర్వాత మార్స్‌పైకి పంపేందుకు వీలుగా మార్పులు చేశారు. భూమి అవతల ఇలా కాళ్లతో నడిచే రోబోను వినియోగించనుండటం ఇదే తొలిసారి కానుంది.

రోవర్లకు సమస్యలు రావడంతో..
మార్స్‌ పైకి 2006లో పంపిన ఆపర్చునిటీ రోవర్‌ ఓసారి ఇసుకలో ఐదు వారాల పాటు చిక్కుకుపోయింది. చివరికి మెల్లగా బయటపడింది. ఇక 2009లో పంపిన స్పిరిట్‌రోవర్‌కూడా పెద్ద రాళ్లు ఉన్న ఇసుకలో చిక్కుకుపోయింది. అది బయటికి రాలేకపోవడంతో ఆ మిషన్‌నే ఆపేశారు. ఇలాంటి సమస్య లేకుండా పనిచేసేలా ‘స్పేస్‌బాక్‌’ను రూపొందించారు. ప్రస్తుతం మార్స్‌పై నాసాకు చెందిన క్యూరియాసిటీ, పర్సవరెన్స్‌రోవర్లు, చైనాకు చెందిన ఝురోంగ్‌ రోవర్‌ పరిశోధనలు చేస్తున్నాయి.

‘స్పేస్‌బాక్‌’.. ఈజీ గోయింగ్‌
రాళ్లురప్పలు, ఇసుకతో కూడిన ప్రాంతాల్లో అయినా, గుంతలుగా, ఎత్తుపల్లాలతో ఉన్న చోట, చిన్న చిన్న కొండలపైకి ఈ ‘స్పేస్‌బాక్‌’రోబో సులువుగా వెళ్లగలదు. ఇందుకోసం దీని కాళ్లను ప్రత్యేకంగా డిజైన్‌చేశారు. ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు పడిపోకుండా, ఎక్కువ శక్తి వృథా కాకుండా అటూ ఇటూ వంకరటింకరగా నడిచేలా సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేశారు. మార్స్‌పై ఉండే నేల వంటిదానిని ల్యాబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పరీక్షించగా.. ఈ రోబో సులువుగా నడవగలిగింది. అయితే ఈ రోబో రోవర్లకు ప్రత్యామ్నాయం కాదని.. రోవర్లకు వీలుకాని చోట్లకు వెళ్లి పరిశోధన చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
చదవండి: Fastskin 4.0: ఆక్వామ్యాన్‌ లాంటి సూట్‌.. ఎలా పని చేస్తుందంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top