Dinosaur: పళ్లులేని రాకాసి బల్లి.. శిలాజ అండంలో ఎదిగిన పిండం!

Fossilized Dinosaur Embryo Discovered Perfectly Preserved Within Egg - Sakshi

ఏడు కోట్ల ఏళ్లకు పూర్వపు డైనోసార్‌ గుడ్డు లభ్యం

చైనాలో కనుగొన్న పురాతత్వ వేత్తలు

బీజింగ్‌: దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్‌ గుడ్డును చైనాలోని గాంఝూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్‌ అని పేరుపెట్టారు. ఈ గుడ్డు పళ్లులేని రాకాసి బల్లి ఒవిరాప్టోరోసారస్‌కు చెందినదై ఉండొచ్చని పరిశోధన నిర్వహించిన బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్‌ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు, దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం.

బేబీ ఇంగ్‌లియాంగ్‌ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని అందుకే దాని తల శరీరం కిందకు ముడుచుకొనిఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టకింగ్‌ అంటారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి, ఈ డైనోసార్‌ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టకింగ్‌ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు.

ప్రస్తుతం లభించిన డైనోసార్‌ శిలాజ అండంలో కూడా ఇదే పొజిషన్‌లో పిండం ఉండడం గమనిస్తే ఈ తరహా భంగిమ తొలుత డైనోసార్లలో ఉండేదని, కాలక్రమేణా పక్షుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో వీటి సంబంధం తదితరఅంశాలను పరిశోధించేందుకు తాజా శిలాజం ఉపయోగపడుతుందని పరిశోధక బృందంలోని ప్రొఫెసర్‌ ఫియాన్‌వైసుమ్‌ మా చెప్పారు. నిజానికి దీన్ని 2000 సంవత్సరంలోనే కనుగొన్నారు. అనంతరం పదేళ్లు స్టోరేజ్‌లో ఉంచారు. 2010 తర్వాత దీనిపై పరిశోధనలు ఆరంభించారు. ఇందులో ఎదిగిన పిండం ఉందనే విషయం తాజాగా బయటపడింది. పరిశోధనా వివరాలను జర్నల్‌ ఐసైన్స్‌లో ప్రచురించారు.

బేబీ ఇంగ్‌లియాంగ్‌ విశేషాలు
► వయసు: సుమారు 6.6– 7.2 కోట్ల ఏళ్లు.
► జాతి: ఒవిరాప్టోరోసారస్‌(గుడ్లను దొంగలించే బల్లులు అని అర్ధం)
► పొడవు: 27 సెంటీమీటర్లు. (ముడుచుకోకుండా ఉంటే)
► గుడ్డు సైజు: 17 సెంటీమీటర్లు.  
► పెద్దయ్యాక సైజు: 2– 3 మీటర్లు(అంచనా).

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top