‘కెర్చ్‌ వంతెన’కు ప్రతీకారం.. ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో భీకర దాడులు

Explosions In Kyiv After Putin Blames Ukraine For Bridge Explosion - Sakshi

కీవ్‌: కెర్చ్‌ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యాకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడుకు ఉక్రెయిన్ కారణమని ఆరోపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్లు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఉదయం 8.15 గంటలకు తొలిసారి పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ‍బ్లాస్ట్‌ జరిగిన ప్రాంతానికి భారీగా అంబులెన్స్‌లు తరలివెళ్లాయని పేర్కొంది. 

ఉక్రెయిన్‌లో చాలా నగరాల్లో సోమవారం మిసైల్‌ దాడులు జరిగినట్లు ఆరోపించారు అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ. ‘మిసైల్స్‌ దాడిలో ఉక్రెయిన్‌ చిక్కుకుంది. దేశంలోని చాలా నగరాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.’ అని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాజధాని కీవ్‌లోని షెవ్‌చెన్కివిస్కీ జిల్లాలో పలు భారీ స్థాయి పేలుళ్లు సంభవించాయి.’ అని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు కీవ్‌ మేయర్‌ విటాలి క్లిట్స్‌చ్కో. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వీడియోల్లో పలు ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకున్నట్లు కనిపిస్తోంది. రాజధాని కీవ్‌పై చివరిసారిగా జూన్‌ 26న దాడి చేశాయి రష్యా సేనలు. తాజాగా కెర్చ్‌ వంతెన కూల్చివేతకు ప్రతీకార దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతంలో రష్యా ఆదివారం జరిపిన మిసైల్స్‌ దాడుల్లో 13 మంది మరణించారు. ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. ఈ దాడిలో 11 మంది చిన్నారుల సహా మొత్తం 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోని కీలక వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్‌ పేలుళ్ల ఘటనలు పెరిగాయి. దీంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్‌.. ఉక్రెయిన్‌ ఘాటు కౌంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top