క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్‌.. ఉక్రెయిన్‌ ఘాటు కౌంటర్‌

Russia Putin Reacts On Crimea bridge blast Ukraine Counter It - Sakshi

మాస్కో: కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్రంగా స్పందించాడు. రష్యా-క్రిమియాలను కలిపే ఆ వంతెనపై దాడికి ఉక్రెయిన్‌ కారణమని ఆరోపించిన ఆయన.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించాడు. 

ఇది రష్యాకు సంబంధించిన క్లిష్టమైన, అతిముఖ్యమైన పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ఉద్దేశించిన తీవ్రవాద చర్య. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఉక్రెయిన్‌ నిఘా బలగాలు ఉద్దేశపూర్వకంగా ఇందులో పాల్గొన్నాయి అంటూ క్రెమ్లిన్‌ టెలిగ్రామ్‌ ఛానెల్‌ ద్వారా పుతిన్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ పేలుడుకు కర్త, కర్మ, క్రియ.. అన్నింటికి ఉక్రెయిన్‌ కారణం అని ఆయన పేర్కొన్నారు. 

2014లో క్రిమియాను రష్యా, ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్నాక.. నాలుగేళ్లకు ఈ బ్రిడ్జిని ప్రారంభించింది. సుమారు 19 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జిని 2018లో గ్రాండ్‌గా ప్రారంభించారు పుతిన్‌. ఉక్రెయిన్‌ దక్షిణ భాగానికి మాస్కో దళాలు చేరుకునేందుకు కెర్చ్ స్ట్రెయిట్ వీలుగా ఉండేది. అంతేకాదు.. రష్యా నల్ల సముద్రం నౌకాదళం ఉన్న సెవాస్టోపోల్ నౌకాశ్రయానికి కూడా ఈ వంతెన ప్రధాన మార్గం. అయితే క్రెమ్లిన్‌-రష్యాలను అనుసంధానం చేసే ఈ కీలక వారధిపై శనివారం బాంబు పేలుడుతో మంటలు ఎగసిపడ్డాయి. బ్రిడ్జి సగ భాగం నాశనం కాగా, ముగ్గురు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో.. రష్యా ఇన్వెస్టిగేటివ్‌ కమిటీ హెడ్‌ అలెగ్జాండర్‌ బస్ట్రీకిన్‌తో పుతిన్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఆయన పుతిన్‌కు వివరించారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకున్నా.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్‌ వర్గాల పనేనని రష్యా ఆరోపిస్తోంది. పేలుడు ధాటికి బ్రిడ్జి ఒక పక్క భాగం నాశనం అయ్యిందని, ఒక్కరోజు విరామం తర్వాత రైలు సేవలు, పాక్షిక రహదారి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని రష్యా అధికారులు తెలిపారు.

పుతిన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌
ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడి ఆరోపణలకు ఉక్రెయిన్‌ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది.  అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్‌ స్పందిస్తూ.. పుతిన్‌ ఆరోపణలను తిప్పి కొట్టారు. ఉక్రెయిన్‌ది ఉగ్రవాదమా? ఇక్కడున్నది ఒకే ఒక్క ఉగ్రవాద దేశం. అదేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉక్రెయిన్‌ ఉగ్రవాదానికి పాల్పడుతోందన్న పుతిన్‌ ఆరోపణలు.. చివరికి రష్యాకు కూడా విరక్తిగా అనిపించకమానదు. ఇక బ్రిడ్జి దాడిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెటకారంగా స్పందించారు. ఉక్రెయిన్‌లో ఇవాళ పగలు అంతా బాగోలేదు. బాగా ఎండ దంచికొడుతోంది. దురదృష్టవశాత్తూ క్రిమియాలో మాత్రం  దట్టంగా మేఘాలు అలుముకుని ఉన్నాయి. అదే సమయంలో వెచ్చగానూ ఉంది అంటూ దాడిని ఉద్దేశించి శనివారం రాత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలన విషయాలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top