లాక్‌డౌన్‌లతో మేలుకన్నా కీడే ఎక్కువ

Edinburgh university Study On Corona, Shocking Issues in Telugu - Sakshi

కరోనాపై తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచంలోని పలు దేశాలు అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ల వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతోందని ఎడిన్‌బర్గ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఓ తాజా అధ్యయనంలో తేల్చారు. కరోనా కట్టడిలో భాగంగా యువతను బయటకు వెళ్లకుండా చేయడం కోసం విద్యా సంస్థలను, వినోద కేంద్రాలను మూసివేయడం తెల్సిందే. ఫలితంగా వైరస్‌ ప్రభావంతో యువతలో సహజ సిద్ధంగా పెరగాల్సిన రోగ నిరేధక శక్తిని అనవసరంగా వాయిదా వేస్తున్నామని పరిశోధన ఫలితాలకు అక్షరరూపం ఇచ్చిన ప్రొఫెసర్‌ గ్రేమీ ఆక్‌లాండ్‌ తెలిపారు. 

కరోనా వైరస్‌ ప్రభావాన్ని నేరుగా యువత ఎదుర్కొన్నట్లయితే వారిలో త్వరగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, వైరస్‌ను ఎదుర్కోవడంలోనూ సమష్టితత్వం బాగా పనిచేస్తోందని, యువత కలసి మెలసి తిరుగుతూనే వైరస్‌ ప్రభావానికి గురవడం వల్ల అందరిపై వైరస్‌ అంత ఎక్కువగా ప్రభావం చూపలేదని కూడా ఆయన చెప్పారు. పైగా తొలి రోజుల్లోనే యువతను వైరస్‌ను ఎదుర్కొన్నయిట్లయితే వైరస్‌ కూడా వాతావరణంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన అన్నారు.  వైరస్‌కు యువతను దూరంగా ఉంచడం వల్ల యువతపై వైరస్‌ ప్రభావాన్ని వాయిదా వేస్తున్నామని, దానితోపాటు వారిలో పెరగాల్సిన రోగ నిరోధక శక్తి అభివద్ధిని కూడా వాయిదా వేస్తున్నామని చెప్పారు. చదవండి: ట్రంప్‌ చేతకానితనం వల్లనే ఈ భారీ నష్టం

వృద్ధులు, ఇతర జబ్బులతో బాధ పడుతున్నవారికి కరోనా వైరస్‌ మరింత ప్రాణాంతకం కనుక అలాంటి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వారి విషయంలో లాక్‌డౌన్‌లు పని చేస్తున్నాయి తప్పా యువత విషయంలో కాదని అన్నారు. యువతను దూరంగా ఉంచడం వల్ల ప్రస్తుతం ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించగలుగుతున్నాం తప్పా మరేమి కాదని ప్రాఫెసర్‌ ఆక్‌లాండ్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చాక కొంతకాలం లాక్‌డౌన్‌ విధించి అందరికి వ్యాక్సిన్‌ చేస్తూ రావడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. వైరస్‌ మహమ్మారి అనేది ఎక్కువగా జన సమూహాలపైనే ప్రభావం చూపిస్తుందని, సమూహంగాన్నే వైరస్‌ను ఎదుర్కోవడం వల్ల సంఖ్యాపరంగా వైరస్‌ శాతం తగ్గి అది బలహీన పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

లాక్‌డౌన్‌ విధించిన దేశాలు, ప్రాంతాలు, ఎప్పుడు లాక్‌డౌన్‌లు విధించారు, ఎప్పుడు ఎత్తివేశారన్న అంశాలతో పాటు, అప్పుడు, ఇప్పుడు కరోనా బారిన పడి మరణిస్తున్న వారి డేటాను కంప్యూటర్‌ సిములేషన్‌తో విశ్లేషిస్తే మృతుల సంఖ్య ఎప్పటిలానే ఉన్నట్లు తేలిందన్నారు. అంటే లాక్‌డౌన్‌ల వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరిగిందన్న మాట. హెర్డ్‌ ఇమ్యూనిటీ (జన సముహాలు)కి మద్దతుగా తీసుకొచ్చిన బారింగ్టన్‌ డిక్లరేషన్‌కు తొమ్మిది వేల మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆమోదం తెలిపారు. కరోనా వైరస్‌ సోకిన రోగుల్లో 86 శాతం మందిలో ప్రధానమైన మూడు వ్యాధి లక్షణాలు అసలే లేవని కూడా బుధవారం నాటి సర్వేలో తేలింది. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో ఈ అంశం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోందని ప్రొఫెసర్‌ ఆక్‌లాండ్‌ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ల మూలంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన విషయం తెల్సిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top