
తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు
తెలంగాణకు ప్రత్యేకమైన మరియు ఆడపడుచుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నివసించే తెలుగువారు ఘనంగా ప్రారంభించారు. నిన్నటితో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డా. మమతా వుసికల,వినీల బతులా ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో అనేక మహిళలు పాల్గొని పువ్వులతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తయారుచేశారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. బతుకమ్మ పాటలకు గుంపులుగా చిందులేసి ఉత్సాహంగా నర్తించి ఆధ్యాత్మికతతో కూడిన ఉత్సవాలను జరుపుకున్నారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాక, విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి ఐక్యతకు, వారి భాషా-బాషా సంస్కృతులకు నిదర్శనంగా నిలిచింది.
ఈ ఉత్సవానికి మదర్ ఎర్త్ హిందూ టెంపుల్ గ్లాస్గో అధ్యక్షులు డా. పునీత్ బేడి, ఉపాధ్యక్షురాలు డా. మమతా వుసికల ముఖ్య నాయకత్వం వహించారు. వారు వచ్చే వారంలో మరింత విస్తృతంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులతో, సాంస్కృతిక ప్రదర్శనలతో, సంప్రదాయ తెలంగాణ వంటకాలతో ఆ వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ విధంగా గ్లాస్గో నగరంలో బతుకమ్మ పండుగ ఆరంభం ప్రవాసాంధ్రులు, ప్రవాసతెలంగాణ వాసుల్లో ఆనందం కలిగించిందని, తమ పుట్టిన గడ్డ సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక గొప్ప ముందడుగని హాజరైన వారు పేర్కొన్నారు.