ఫైల్ ఫోటో
అమెరికన్ లెజెండరీ రాపర్ టూపాక్ షకూర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా అంతుచిక్కని ఈ సంచలన మర్డర్ మిస్టరీలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ దారుణ హత్యకు కుట్ర పన్నిన మాజీ గ్యాంగ్ లీడర్ డ్వేన్ "కీఫ్ డి" డేవిస్‌కు కోర్టు కఠిన శిక్ష ఖరారు చేసింది
లాస్ వెగాస్ కోర్టు దోషి డ్వేన్ "కీఫ్ డి" డేవిస్ (63) కు 40 సంవత్సరాల జీవిత ఖైదుశిక్షను విధించింది. అంటే కనీసం 40 ఏళ్ల పాటు అతడు జైలు జీవితం అనుభవించిన తర్వాతే పెరోల్ లేదా విడుదల గురించి పరిశీలిస్తారు. గతంలో ఆగస్టులో జరిగిన విచారణలో జ్యూరీ అతడిని ఫస్ట్-డిగ్రీ హత్య కేసులో దోషిగా తేల్చింది. అమెరికన్ హిస్టరీలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నడిచిన కోల్డ్ కేస్‌లలో ఇది ఒకటి కావడం గమనార్హం
అసలేం జరిగింది?
హిప్-హాప్ మ్యూజిక్ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టూపాక్ షకూర్.. సెప్టెంబర్ 7, 1996న లాస్ వెగాస్‌లో జరిగిన ఒక డ్రైవ్-బై కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. 'డెత్ రో రికార్డ్స్' సహ-స్థాపకుడు మారియన్ "సుగ్" నైట్ నడుపుతున్న ఎస్‌యూవీ కారులో టూపాక్ ప్రయాణిస్తుండగా, దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన టూపాక్, చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలే.
కాగా ఈ హత్య జరిగి దాదాపు 30 సంవత్సరాలు గడిచినా పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేకపోయారు. ఎలాంటి భౌతిక ఆధారాలు లేకపోవడంతో ఇది అంతుచిక్కని కేస్‌గా మిగిలిపోయింది. అయితే, కీఫ్ డి స్వయంగా తానే ఈ హత్యకు కుట్ర పన్నానని టీవీ ఇంటర్వ్యూలలో, మరియు తన ఆత్మకథ 'కాంప్టన్ స్ట్రీట్ లెజెండ్' పుస్తకంలో గొప్పగా చెప్పుకోవడమే ఆయన అరెస్ట్‌కు కారణమైంది. ఈ ఇంటర్వ్యూలు, స్టేట్‌మెంట్లే ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి 2023లో అతన్ని అరెస్టు చేశారు.
వీడని మరో రహస్యం..
కీఫ్ డికి శిక్ష పడినప్పటికీ, టూపాక్‌పై అసలు తుపాకితో కాల్పులు జరిపింది ఎవారనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు. ఈ దాడికి కీఫ్ డి కేవలం సూత్రధారి మాత్రమేనని, అసలు కాల్పులు జరిపిన ఆయన మేనల్లుడు ఒర్లాండో ఆండర్సన్ అప్పట్లోనే మరణించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
కాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు దోషి తరఫు న్యాయవాది వెల్లడించారు. టూపాక్ కుటుంబ సభ్యులు ఈ తీర్పుపై స్పందిస్తూ.. దశాబ్దాల తర్వాతైనా తమ కుటుంబానికి న్యాయం జరిగిందని, దోషికి తగిన శాక్ష్యాలతో సరైన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు.


