
వలసదారులకు ప్రైజ్‌మనీగా పౌరసత్వం!!
బిగ్‌బాస్ తరహాలో ‘ది అమెరికన్’రియాలిటీ టీవీ షో
ఎపిసోడ్‌కు ఒకరి చొప్పున ఎలిమినేషన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఏంచేసినా వినూత్నమే. వివాదాస్పదమే. అదే పరంపరను కొనసాగిస్తూ ట్రంప్ సొంతంగా సరికొత్త రియాలిటీ షోకు తెరలేపనున్నారన్న వార్త ఇప్పుడు అగ్రరాజ్యంలో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ షో తరహాలో ఇందులో పాల్గొనేవారంతా భిన్న రకాలైన పనులు(టాస్క్ లు) పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అమెరికా జాతీయత కోణం దాగి ఉంది.
మరీ ముఖ్యంగా ఇప్పటికే అనధికారికంగా అమెరికాకు పోటెత్తిన వలసదారులను మాత్రమే ఈ రియాలిటీ షోలో అభ్యర్థులుగా స్వీకరిస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెడతారు. స్వదేశంలో అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ, అనివార్య పరిస్థితుల్లో కొందరు వలసదారులు తిరిగి స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎంపిక చేసి అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది.
ఈ ఎంపికకు రియాలిటీ షో మార్గాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో వివరాలు ఇంకా బహిర్గత కాలేదు. ఇది ఇంకా అమెరికా ప్రభుత్వ వర్గాల వద్ద ప్రతిపాదన దశలోనే ఉందని తెలుస్తోంది. అన్ని రకాల అనుమతులు దాటుకుని ఈ రియాలిటీ షో వాస్తవరూపం దాల్చితే ఈ షోకు అనూహ్య ఆదరణ లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ షోలో గెలిచిన విజేతకు మాత్రమే అమెరికా పౌరసత్వం బేషరతుగా ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఎవరిదీ ఆలోచన?
కెనడియన్–అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. రియాలిటీ షో నియమ నిబంధనలతో సమగ్రంగా 35 పేజీల్లో ఒక రిపోర్ట్‌ను తయారుచేసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) విభాగానికి సమరి్పంచారు. రాబ్ వార్సాఫ్ గతంలో సృష్టించిన ‘డక్ డినాస్టీ’, ‘ది మిలియనీర్ మ్యాచ్‌మేకర్’రియాలిటీ షోలు విజయవంతమైంది. ‘‘రాబ్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం.
నిజంగా ఇదొక మంచి ఆలోచన. హక్కులతోపాటు అమెరికన్లలో దేశభక్తి, పౌరవిధులను మరోసారి స్పష్టంగా స్మరణకు తెచ్చేలా షో ఉంటే బాగుంటుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీలో ప్రజాసంబంధాల మహిళా అసిస్టెంట్ సెక్రటరీ ట్రీసియా మెక్‌లానిన్ అన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి టాస్క్ లు ఉండొచ్చు?
‘ది అమెరికన్’పేరిట జరగబోయే ఈ రియాలిటీ టీవీ షోలో వలసదారుల్లో దేశభక్తి పెంచడంతోపాటు బాధ్యతాయుత పౌరునిగా మెలగాలంటే ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను స్మరణకు తెచ్చేలా టాస్క్ లు రూపొందించనున్నారు. వీటితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండేందుకు పలు రకాల టాస్క్‌లు పెట్టనున్నారు. టెక్సాస్ లేదా ఫ్లోరిడాలో నాసా ప్రయోగకేంద్రాల వద్ద చిన్నపాటి రాకెట్ ఎగరేయడం, శాన్‌ఫ్రాన్సిస్కో గనిలో బంగారాన్ని తవ్వితీయడం(గోల్డ్ రష్), డెట్రాయిట్‌లో ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ల వద్ద మోడల్ ‘టి’కారు ఛాసిస్‌ను బిగించడం, కన్సాస్‌లో గుర్రపుస్వారీ చేస్తూ తపాలాలు భటా్వడా చేయడం వంటి వినూత్న టాస్క్‌లు వలసదారులు పూర్తిచేయాల్సి ఉంటుంది.