
రష్యా నడిబొడ్డుపై నిప్పులు కురిపించగలవా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ట్రంప్ సూటి ప్రశ్నలు
ఆయుధాలందిస్తే అంత పనీచేస్తానన్న జెలెన్‌స్కీ
వాషింగ్టన్: దీటైన అస్త్రశస్త్రాలు అందిస్తే మాస్కోను కొట్టగలవా? రష్యాపై భీకరంగా దాడిచేయగలవా? అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూటి ప్రశ్న వేశారు. జూలై నాలుగో తేదీన జెలెన్‌స్కీకి ఫోన్‌చేసిన మాట్లాడిన సందర్భంగా ట్రంప్, వొలదిమిర్ జెలెన్‌స్కీల మధ్య జరిగిన సంభాషణ తాలూకు విశేషాలను తాజాగా అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కల్గించాలని జెలెన్‌స్కీకి ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇరునేతల సంభాషణ వివరాలను కొన్ని అత్యున్నత వర్గాలు వెల్లడించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘‘ చూడు వొలదిమిర్.. నువ్వు రష్యా రాజధాని మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ తప్పకుండా. మీరు సరైన మిస్సైళ్లు ఇస్తే దాడి చేసి చూపిస్తా’’ అని జెలెన్‌స్కీ హామీ ఇచ్చారు. ‘‘ మీకు కావాల్సిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను అందిస్తాం. రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ను ధ్వంసంచేయగలరా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ ఆ స్థాయిలో దాడికి సరిపడా ఆయుధాలు సమకూరిస్తే తప్పకుండా దాడిచేస్తాం’’ అని జెలెన్‌స్కీ మాటిచ్చారు. ‘‘ దాడుల్లో రక్తమోడుతూ ఉక్రెయిన్‌వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలి. మీ దాడులతో వాళ్లకూ నొప్పి తెలిసిరావాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు సుంకాల సుత్తితో మోదుతానని రష్యాను ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెరమీదకు రావడం గమనార్హం. శాంతి ఒప్పందం చేసుకోండని ఎంతమొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్ ఇలా జెలెన్‌స్కీని దాడులు చేయగలవా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సంభాషణల వార్తపై అటూ శ్వేతసౌధంగానీ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయంగానీ స్పందించలేదు.
నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో కలిసి శ్వేతసౌధంలో ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ పుతిన్ అంత సులభంగా లొంగే మనిషి కాడు. మన నేతలనే మభ్యపెట్టాడు. క్లింటన్ మొదలు జార్జ్ బుష్, ఒబామా, బైడెన్‌దాకా అమెరికా అధ్యక్షులను తన మాటలతో మభ్యపెట్టాడు. నేను వాళ్లలాగా ఫూల్‌ను కాబోను. బిలియన్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తా. నాటో సభ్యదేశాలు ఆర్డర్ ఇచ్చిన 17 గగనతల రక్షణ వ్యవస్థ మిస్సైల్ లాంఛర్లన్నీ ఉక్రెయిన్‌కు పంపిస్తాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.