Zero Covid Cases Countries: కరోనా కేసులు ‘సున్నా’.. ఎక్కడో తెలుసా​?

Coronavirus: WHO Release Zero Covid Cases Countries List - Sakshi

Zero Covid Cases Countries List: కరోనా వైరస్‌ మహమ్మారి.. ప్రపంచ దేశాలను గడగడలాడించింది. పలు దేశాల్లో కోవిడ్‌ విజృంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికి కొన్ని దేశాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వ్యాపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని కొన్ని దేశాల జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసింది. కోవిడ్‌ కేసుల నమోదు సంఖ్య ‘జీరో’ ఉన్న దేశాల జాబితాలో పసిఫిక్‌, అట్లాంటిక్‌ సముద్రపు ద్వీప దేశాలు ఉండటం విశేషం. ఆ దేశాలు ఇవే.. 

టువాలు: ఈ దేశం మూడు దిబ్బ దీవులు, ఆరు పగడపు దీవుల సమూహం. అదే విధంగా కామన్‌వెల్త్‌ సభ్యదేశం కూడా. కరోనా మొదలైన నుంచి  ఈ దేశం దేశసరిహద్దులు మూసివేసి.. నియంత్రణ చర్యలు చేపట్టింది. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికల ప్రకారం.. ప్రతి 100 మంది జనాభాకు దాదాపు 50 మంది టీకాలు వేయించుకున్నారు.

టోకెలావ్: దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని చిన్న పగడపు దీవులున్న ఈ దేశంలో డబ్ల్యూహెచ్‌ఓ రిపోర్టుల ప్రకారం ఒక్క కోవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈ దేశం న్యూజిలాండ్‌కు సమీపంలో ఉంది. టోకెలావ్‌ దేశం కేవలం 1500 జనాభా కలిగి ఉంది. 

సెయింట్ హెలెనా: దక్షిణ అట్లాంటిక్‌ సముద్రంలోని ద్వీపపు దేశం సెయింట్‌ హెలెనా. ఈ దేశంలో కూడా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల నమోదు సంఖ్య ‘సున్నా’.   డబ్ల్యూహెచ్‌ఓ  లెక్కల ప్రకారం.. ప్రతి  వందమందిలో 58  మంది కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

పిట్‌కైర్న్ దీవులు: ఈ దీవులు పసిఫిక్‌ సముద్రంలో ఉన్నాయి. ఈ దీవుల్లో ప్రతి వంద మందిలో 74 మంది కోవిడ్‌ టీకా తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. 

నియు: దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని మరో ద్వీపపు దేశంలో కరోనా కేసుల నమోదు సంఖ్య ‘జీరో’. దేశంలోని ప్రతి వంద మందిలో  79 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

నౌరు: ఈశాన్య ఆస్ట్రేలియాకు సమీపంలోని నౌరులో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. దేశంలోని వందమందిలో 68 మంది కరోనా వ్యాక్సిన్‌ వేసుకున‍్నట్లు తెలిపింది.

మైక్రోనేషియా:  చుక్, కోస్రే, పోహ్న్‌పే, యాప్ అనే  నాలుగు రాష్ట్రాలను కలిగి ఉ‍న్న ఈ దేశంలో కరోనా కేసుల నమోదు సంఖ్య ‘జీరో’గా డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ప్రతి వంద మందిలో 38 మంది కోవిడ్‌ టీకా వేయించుకున్నారు.

వీటితోపాటు తుర్క్‌మెనిస్తాన్, ఉత్తర కొరియా దేశంలో కరోనా వైరస్‌ నమోదు కేసుల సంఖ్య ‘సున్నా’ జాబితాలో డబ్ల్యూహెచ్‌ఓ చేర్చింది. అయితే ఈ రెండు దేశాల్లో కరోనా వైరస్‌కి సంబంధించిన అధికారిక సమాచారం బయటి ప్రపంచానికి తెలియకపోవటం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top