అమెరికాలో గొరిల్లాలకు కరోనా

Corona For Gorillas In America - Sakshi

శాన్‌డియోగో: కరోనా వైరస్‌ మనుషులతో పాటు మూగ జీవాలను కూడా విడిచిపెట్టడం లేదు. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి వైరస్‌ సోకింది. అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కరోనా సోకినట్టుగా పార్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లిసా పీటర్సన్‌ సోమవారం వెల్లడించారు. కరోనా సోకిన వాటిలో కొన్ని గొరిల్లాలు బాగా దగ్గుతున్నాయని చెప్పారు. పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్‌ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పీటర్సన్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా నిర్ధారణ అయిందని, గొరిల్లాల దగ్గరకి వెళ్లినప్పుడు అతను ఎల్లప్పుడూ మాస్కు ధరించేవాడని చెప్పారు. గత బుధవారం నుంచి గొరిల్లాలు కాస్త నలతగా కనిపిస్తూ దగ్గుతూ ఉండడంతో ఒక గొరిల్లాకి పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్‌గా తేలింది.

మిగిలిన వాటికి కూడా కరోనా సోకినట్టుగానే భావిస్తున్నట్టు జంతు ప్రదర్శన శాల అధికార ప్రతినిధి ఆండ్రూ జేమ్స్‌ చెప్పారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ చర్యల్లో భాగంగా  డిసెంబర్‌ 6 నుంచి ఈ జూని మూసే ఉంచారు. గొరిల్లాలలో కరోనా లక్షణాలు బయటపడిన దగ్గర్నుంచి వాటికి ప్రత్యేకంగా ఆహారం ఇస్తున్నారు. విటమిన్లు, ఫ్లూయిడ్స్‌ అధికంగా అందిస్తున్నారు. వాటి దగ్గరకి వెళ్లినప్పడు సిబ్బంది అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కుతో పాటు ఫేస్‌షీల్డ్, కళ్లద్దాలు పెట్టుకొని వెళుతున్నారు. ఈ గొరిల్లాలలో మూడు అంతరించే జాతిలో ఉండడంతో జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. గత 20 ఏళ్లలో  ఈ గొరిల్లాల సంఖ్య 60శాతానిపైగా పడిపోయింది. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు దగ్గర్నుంచి అటవీ జంతువులు  పులులు, సింహాలకు కరోనా సోకింది. కానీ గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే ప్రథమం   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top