వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం

China objects to Venkaiah visit to Arunachal Pradesh - Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఇటీవల సాగించిన అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటన పట్ల డ్రాగన్‌ దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశ నాయకులు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము కచి్చతంగా, గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పింది. అరుణాచల్‌ రాష్ట్రాన్ని తాము ఇండియాలో భాగంగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. వెంకయ్య నాయుడు ఈ నెల 9న అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు.

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, హింసకు తెరపడి, శాంతి నెలకొంటోందని చెప్పారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా ఇండియాలో కలిపేసుకున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని, అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని తేలి్చచెప్పారు. చైనా, భారత్‌ మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించవద్దని భారత్‌కు హితవు పలికారు.  

అరుణాచల్‌ మా దేశంలో అంతర్భాగం: భారత్‌   
అరుణాచల్‌ ప్రదేశ్‌లో వెంకయ్య నాయుడు పర్యటించడం పట్ల చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. చైనా అభ్యంతరాలను తిరస్కరించింది. అరుణాచల్‌ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తేలి్చచెప్పారు. భారత్‌ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంపర్థం లేని పని అని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top