పుట్టింటికని వెళ్లి మరో వ్యక్తిని పెళ్లాడింది.. ఏకంగా 19 మందిని

China Man Shocked to Find Video of Wife Marrying Another Man on Social Media - Sakshi

చైనాలో చోటు చేసుకున్న సంఘటన

పోలీసుల అదుపులో కిలేడీ

బీజింగ్‌: చైనాకు చెందిన ఓ వ్యక్తికి అతడి భార్య ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకోవాలంటే మరో పుష్కర కాలం పట్టేలా ఉంది. ఇంతకు అతగాడి భార్య ఏ చేసిందో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.. ఇన్నర్ మంగోలియాలోని బయన్నూర్‌కు ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల బలవంతం మీద కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. విశేషం ఏంటంటే 148,000 యువాన్‌లు (రూ.16.9 లక్షలు) ఎదురు కట్నం చెల్లించి మరీ అతడికి వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అయితే భార్య ఇంట్లో ఏవో సమస్యలు ఉండటంతో పెళ్లైన వెంటనే వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకోలేదు. ఇక ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. 

పెళ్లైన కొద్ది రోజులకు సదరు వ్యక్తి భార్య.. మా అమ్మనాన్నలను చూడాలని ఉంది.. ఓ సారి నా పుట్టింటికి వెళ్లి వస్తాను అని కోరింది. దానికతడు అంగీకరించడంతో ఊరికి వెళ్లింది. ఇదిలా ఉండగా భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒక్కడికే బోర్‌ కొట్టడంతో సోషల్‌ మీడియాలో వీడియోలు చూస్తూ టైం పాస్‌ చేయసాగాడు. ఈ క్రమంలో ఓ పెళ్లి వీడియో అతడి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో పెళ్లి కుమార్తె చాలా అందంగా ఇంకా చెప్పాలంటే.. అచ్చు తన భార్యలాగే ఉంది. కాసేపు వీడియోను పరిశీలించి చూసిన అతడికి ఒక్కసారిగా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఎందుకంటే దానిలో ఉంది తన భార్యే .. డౌట్‌ లేదు. 

దాంతో వెంటనే భార్యకు కాల్‌​ చేశాడు. ఎలాంటి స్పందన లేదు.. ఆ తర్వాత అత్తమామకు కాల్‌​ చేస్తే వారు కూడా ఫోన్‌​ లిఫ్ట్‌ చేయలేదు. ఆమె నివసిస్తున్న గ్రామానికి చేరుకుని విచారించగా.. అతడి గాడి భార్య తాజాగా మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. వేరే దారి లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి భార్య అతడినే కాక మరో 19 మంది వ్యక్తులను ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు తెలిసింది.

ఆమె మోసం చేసిన బాధితుల్లో ఎక్కువ మంది గ్రామాల్లో నివసించేవారే. పైగా వారంతా వయస్సు ముదిరిన మగాళ్లు. త్వరగా పెళ్లి చేసుకోవాలని తొందరపడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆమె ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఆమె సుమారు 2 మిలియన్ యువాన్లు (రూ.2.28 కోట్లు) మోసం చేసినట్లు పేర్కొన్నారు. అదే ప్రావీన్స్‌కు చెందిన దావా అనే మహిళ కూడా ఆగస్టు 2019 నుంచి ఇలాంటి మోసాలకు పాల్పడుతుందన్నారు. దావా సాయంతోనే ఈ మహిళ కూడా పురుషులను మోసాలు చేస్తొందన్నారు. మొత్తానికి పోలీసులు ఈ కేసులో ఇద్దరు మహిళలను, వారి బంధువులుగా నటించిన ఇద్దరు వ్యక్తులతో పాటు వీరికి పెళ్లి సంబంధాలు కుదిర్చన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి: పెళ్లి చేయమంటే ఆగమన్నారు.. అందుకే ఇలా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top