
సిబ్బంది ఒత్తిడిని దూరం చేయడం కోసం కొన్ని సంస్థలు ఆఫీసులోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తుంటాయి. కానీ.. ఓ చైనీస్ కంపెనీ మాత్రం.. స్విమ్మింగ్ పూల్‌నే ఆఫీసుగా మార్చేసింది. ఆఫీస్‌గా మారిన పూల్ ఫొటోలు, వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. స్విమ్మింగ్ పూల్ చుట్టూ.. ఫ్లోర్ సాకెట్లు, ఎక్స్‌టెన్షన్ కేబుళ్లతో ఉన్న వర్క్‌స్టేషన్ ఇప్పుడు ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలు రేకెత్తించడంతో చివరకు ఖాళీ చేయాల్సి వచి్చంది.
చైనాకు చెందిన లుబాన్ డెకరేషన్ గ్రూప్ అనే డెకరేషన్ కంపెనీ ఖాళీగా ఉన్న ఈత కొలనును తాత్కాలిక వర్క్‌స్పేస్‌గా మార్చింది. జిమ్ పక్కన ఉన్న గాజు తలుపు నుంచి పూల్ ఆఫీస్‌లోకి వస్తారు. పూల్‌లో ఉన్న సైడ్ నిచ్చెనలు ఉపయోగించి తమ డెస్క్ దగ్గరకు వెళ్తారు. అలాగే.. వాటి ద్వారా తిరిగి బయటికి వస్తారు. సిబ్బంది రెండు నెలలుగా అక్కడ పనిచేస్తున్నారు. ఈ విచిత్రమైన సెటప్‌కు సంబంధించిన వీడియో ఒకటి సిబ్బంది ఆన్‌లైన్‌లో పెట్టడంతో చర్చనీయాంశమైంది.
ఉద్యోగులు తన డెస్క్ నుండి కిందికి చూస్తే, కనిపించే పూల్ లేన్ గుర్తుల కారణంగా వారు చిన్న డైవింగ్ ట్యాంక్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. తాము ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నట్లు అనిపిస్తుందని, వింతగా ఉన్నప్పటికీ బాగుందని తెలిపారు. కొందరు ఇది సృజనాత్మకంగా ఉందంటే.. మరికొందరేమో ఉద్యోగుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఏదైనా అత్యవసర సమయాల్లో తరలింపు మార్గాలు లేకపోవడం, అవసరమైన అగి్నమాపక భద్రతా లక్షణాలు లేకపోవడం ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. పూల్ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలు తలెత్తాయి. ‘ఈ కార్యాలయ సెటప్ నిజంగా ప్రత్యేకమైనది. మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కష్టమే’అని కొందరు, ‘ఈ కార్యాలయం ట్రెండీగా కనిపించవచ్చు, కానీ తేమ వల్ల రుమాటిజం రావచ్చు. లోతైన చివరలో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కీళ్ళకు నష్టం జరగుతుంది’అని మరికొందరు హెచ్చరించారు. అయితే.. ఆఫీస్ పునరుద్ధరణ కారణంగా పూల్‌కు మార్చా మని, ఈ సెటప్ తాత్కాలిక పరిష్కారమేనని సంస్థ తెలిపింది. అయినప్పటికీ.. కంపెనీ తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించిన స్థానిక అగి్నమాపక విభాగం ఆ స్థలాన్ని ఖాళీ చేయించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్