వీడియో: దుర్మార్గం.. భూకంపంతో బయటకు పరుగులు.. చస్తే చావమంటూ అడ్డుకున్న సిబ్బంది

China Earthquake: People Not Allowed Under Covid Restrictions - Sakshi

వైరల్‌: ఈ వీడియో చూస్తే ఇంత దుర్మార్గమా? అని ఎవరైనా అనకుండా ఉండలేరు. ఒకవైపు ప్రకంపనలు వస్తుంటే.. భయంతో జనాలు పరుగులు తీయకుండా ఉంటారా?. కానీ, ఏం జరిగినా బయటకు పంపేదే లేదని వాళ్లను అడ్డుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

కరోనా విషయంలో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుని చాలాకాలమే అవుతోంది. అయితే.. చైనాలో జీరో-కొవిడ్‌ పాలసీ కఠినాతీకఠినంగా అమలు అవుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు టెస్టింగ్‌.. ఐసోలేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు అక్కడ. ఆ దెబ్బకు జనాలు పిచ్చెక్కిపోతున్నారు.

తాజాగా.. మరో దారుణం బయటపడింది. చైనాలో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 2017 తర్వాత సిచువాన్‌ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ భూకంపం ఇదే. కొండచరియలు ఉండే ప్రాంతం కావడంతో భారీగానే నష్టం వాటిల్లింది.  కనీసం 50 మంది దాకా మరణించగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయి.

అయితే భూకంపం సమయంలోనూ లాక్‌డౌన్‌, ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లను బయటకు వదల్లేదు ఆరోగ్య సిబ్బంది. పైగా బిల్డింగ్‌ కూలితే ఇందులోనే చావాలే తప్ప.. బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్న వీడియోలు కొన్ని నెట్‌లో వైరల్‌ అవుతోంది ఇప్పుడు. ఈ క్రమంలో కొందరితో సిబ్బంది దురుసుగా సైతం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చైనా ట్విటర్‌ హ్యాండిల్స్‌ నుంచే వైరల్‌ అవుతుండడం గమనార్హం. అయితే వీటిపై చైనా అధికారులు స్పందించాల్సి ఉంది.

అంతేకాదు భూకంప బాధితులకు సాయాన్ని సైతం కరోనా టెస్టుల క్లియరెన్స్‌ తర్వాత ఇస్తామని అధికారులు చెప్తున్నారంటే..  పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో పలు నగరాల్లో లక్షల మంది ఇంకా కరోనా కట్టడిలోనే ఉండిపోయారు.

ఇదీ చదవండి: మీజిల్స్ విజృంభణ.. 700 మంది చిన్నారుల మృతి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top