భారత్‌ ప్రతిపాదనకు మరోమారు మోకాలడ్డిన చైనా.. పాక్‌ ఉగ్రవాదికి మద్దతు

China Again Blocks India US Move At UN To Blacklist Talha Saeed - Sakshi

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌కు వంతు పాడే చైనా మరోమారు తన కుటిల బుద్ధిని చూపించింది. లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ కుమారుడు తల్హా సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే భారత్‌-అమెరికా ప్రతిపాదను అడ్డుకుంది. పాకిస్థాన్‌కు చెందిన తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్‌, అమెరికా ప్రతిపాదించగా.. బీజింగ్‌ హోల్డ్‌లో పెట్టింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది షాహిద్‌ మహమూద్‌ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా గుర్తించటాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే మరోమారు చైనా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ కుమారుడు హఫీజ్‌ తల్హా సయీద్‌ను ఇటీవలే ఉగ్రవాదిగా గుర్తించింది భారత్‌. చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం 1967 కింద హఫీజ్‌ సయీద్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8న నోటిఫికేషన్‌ జారీ చేసింది. తల్హా సయీద్‌.. భారత్‌లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టటం, నిధులు సేకరించటం, దాడులకు ప్రణాళికలు రచించటంలో కీలకంగా వ్యవహరించినట్లుపేర్కొంది.  

ఐక్యరాజ్య సమితిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీలో భారత్‌, అమెరికా ప్రతిపాదనలకు చైనా అడ్డుకోవటం ఇదేం మొదటిసారి కాదు. గడిచిన నాలుగు నెలల్లోనే చైనా ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వటం ఇది ఐదోసారి. ఇటీవలే లష్కరే సభ్యుడు షాహిద్‌ మహమూద్‌, సెప్టెంబర్‌లో సాహిద్‌ మిర్‌, జూన్‌లో జమాత్‌ ఉద్‌ దావా లీటర్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీ, ఆగస్టులో జైషే మహమ్మద్‌ చీఫ్‌ సోదరుడు అబ్దుల్‌ రావూఫ్‌ అజార్‌లకు మద్దతు తెలిపింది. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులగా గుర్తించాలని ప్రతిపాదనకు అడ్డుపడింది.

ఇదీ చదవండి: భారత్‌పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్‌.. టాప్‌ పోస్టులతో సత్కారం!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top