బిల్‌గేట్స్, రిషితో చాట్‌జీపీటీ ఆసక్తికర ఇంటర్వ్యూ

ChatGpt Interview With Uk Pm Rishi Sunak And Bill Gates - Sakshi

లండన్‌:  చాట్‌జీపీటీ. ప్రపంచమంతటా విశేషంగా ఆదరణ పొందుతున్న కృత్రిమ మేధ ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌. టెక్‌ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికింది చాట్‌జీపీటీ. సందేహాలు తీర్చుకోవాలన్నా, సంగీత స్వరాలు కూర్చాలన్నా, కవిత్వం రాయాలన్నా, వ్యాసాలు సిద్ధం చేసుకోవాలన్నా, కొత్త ఐడియాలు సృష్టించుకోవాలన్నా, చివరికి ప్రేమలేఖ రాయాలన్నా చలో చాట్‌జీపీటీ అనే పరిస్థితి! మరి చాట్‌జీపీటీయే యాంకర్‌ అవతారమెత్తితే? ఇద్దరు అత్యంత ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తే? అదే జరిగింది! బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌లకు చాట్‌జీపీటీ పలు ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టింది.

చాట్‌జీపీటీతో తమ ఇంటర్వ్యూను బిల్‌ గేట్స్‌ లింక్డ్‌ఇన్‌లో షేర్‌ చేశారు. తమ సంభాషణ అద్భుతంగా సాగిందన్నారు. రిషి మాటలతో వీడియో మొదలైంది. బిల్‌ గేట్స్, తాను లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో ఉన్నామని, యూకేలో క్లీన్‌ టెక్నాలజీ రంగంలోని అగ్రశ్రేణి ఆవిష్కర్తలను కలిశామని ఆయన చెప్పారు. తర్వాత గేట్స్‌ తెరపైకి వచ్చి సంభాషణలో పాలుపంచుకున్నారు. తమను చాట్‌జీపీటీ ఇంటర్వ్యూ చేయబోతోందని అన్నారు. 

ఇలా సాగింది... 
రాబోయే పదేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, జాబ్‌ మార్కెట్‌పై టెక్నాలజీ ప్రభావం ఏ మేరకు ఉండబోతోందని చాట్‌జీపీటీ ప్రశ్నించింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో నిపుణులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని, మరింత సమర్థులు అవసరమని గేట్స్‌ బదులిచ్చారు. ఈ విషయంలో కృత్రిమ మేధ వంటి టెక్నాలజీ సహకరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో నైపుణ్యాలున్న మానవ వనరులను తయారు చేసుకోవచ్చన్నారు. అనంతరం, ‘‘కాలచక్రంలో మీరు యువకులుగా ఉన్న రోజుల్లోకి, అంటే మీ కెరీర్‌ ప్రారంభంలో ఉన్న నాటికి వెళ్తే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు?’’ అంటూ చాట్‌జీపీటీ ఆసక్తికరమైన ప్రశ్న వేసింది.

అతిగా ఆలోచించడం మాని వర్తమానంలో జీవించేందుకు మరింతగా ప్రయత్నిస్తామంటూ వారిద్దరూ అంతే ఆసక్తికరంగా సమాధానమిచ్చారు! ‘‘కెరీర్‌ ఆరంభంలో చాలా ఏళ్ల పాటు వీకెండ్స్, సెలవులంటే నాకు పెద్దగా ఇష్టముండేది కాదు. ఎక్కువగా ఆలోచించేవాన్ని. కష్టపడి పని చేసేవాన్ని. కానీ, అంత అతిగా శ్రమించడం అవసరం లేదని ఇప్పుడు భావిస్తున్నా’’ అని గేట్స్‌ చెప్పారు. దానితో రిషి కూడా ఏకీభవించారు. ‘‘మాది బ్రిటన్‌కు వలస వచి్చన కుటుంబం. కనుక బాగా పనిచేసి అన్నింటా ముందంజలో ఉండాలని అప్పట్లో ఎంతో ప్రయతి్నంచేవాడిని. కానీ గతంలోనూ, భవిష్యత్తులోనూ కాకుండా వర్తమానంలోనే జీవించాలని క్రమంగా తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top