హర్ముజ్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్‌ | Ceasefire on the Brink: US Strikes Iran After Hormuz Attacks | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌లో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్‌

Jun 27 2026 6:49 AM | Updated on Jun 27 2026 7:31 AM

Ceasefire on the Brink: US Strikes Iran After Hormuz Attacks

ఇరాన్‌-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ దాడులను కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించిన అమెరికా, ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్‌ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్‌ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్‌ కూడా ఘాటుగానే స్పందించింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్‌లోని ఒక ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్‌ తీర ప్రాంతాల్లోని క్షిపణి నిల్వలు, డ్రోన్‌ స్థావరాలు, రాడార్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని "శక్తివంతమైన దాడులు" నిర్వహించినట్లు పేర్కొంది.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికే కాకుండా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)ను కూడా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఇరాన్‌ "తెలివితక్కువ పని" చేసిందని వ్యాఖ్యానిస్తూ.. ఇటువంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని, అమెరికా తన బాధ్యతలను పాటించిందని చెప్పారు. ఒప్పంద అమలుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, హింసకు హింసతోనే సమాధానం ఉంటుందని హెచ్చరించారు.

అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికానే ఎప్పటిలాగే తన హామీలను ఉల్లంఘించిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ప్రాంతంలోని అమెరికా బలగాల మోహరింపు ప్రాంతాలను తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అమెరికా దాడులు పునరావృతమైతే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అయితే.. అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది.

ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ ఎబ్రహీం అజిజీ కూడా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. చర్చలు, కాల్పుల విరమణ సూత్రాల పట్ల ట్రంప్‌కు ఎలాంటి నిబద్ధత లేదని ఆరోపిస్తూ.. అమెరికా దాడులను నిర్లక్ష్యపూరిత చర్యగా అభివర్ణించారు. 

ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన పెంచుతున్నాయి. ఖతార్ ఎనర్జీకి చెందిన ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ ‘ఉమ్ స్లాల్’ హర్ముజ్ సమీపంలో తన ప్రయాణాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించగా, అంతకుముందు గ్యాస్‌లాగ్ షాంఘై నౌక కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో పేలుళ్లు నమోదవడంతో గల్ఫ్ మార్గంలో ఎల్‌ఎన్‌జీ రవాణాపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.

ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిని తన అత్యంత కీలక వ్యూహాత్మక అస్త్రంగా భావిస్తోంది. ఈ జలసంధిపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడం అంటే చర్చల్లో తన బలమైన ఒత్తిడి సాధనాన్ని కోల్పోవడమేనని టెహ్రాన్ భావిస్తోంది. అందుకే రాజకీయ నాయకులు, సైనికాధికారులు, ఐఆర్‌జీసీ నేతలు హర్ముజ్‌పై తమ నియంత్రణను కాపాడుకునేందుకు అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇటీవల జరిగిన యుద్ధం ప్రాంతీయ వ్యూహాత్మక పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని, ఆ కొత్త వాస్తవాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.

మరోవైపు, అమెరికా మాత్రం ఈ ప్రతీకార దాడులను పరిమితంగానే ఉంచినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్‌ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిన అమెరికా, విస్తృత సైనిక స్థావరాలను మాత్రం టార్గెట్ చేయలేదు. హర్ముజ్‌లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కాపాడుతూనే, దౌత్య చర్చలకు అవకాశం కొనసాగించాలనే ఉద్దేశంతోనే తమ సైనిక చర్యలను పరిమితం చేసినట్లు వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇరు దేశాల పరస్పర ఆరోపణలు, ప్రతీకార చర్యలతో కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై మరోసారి తీవ్ర అనిశ్చితి నెలకొంది.

ఇదీ చదవండి: ఇరాన్‌ యుద్ధం.. వీళ్లకేమో కాసుల వర్షం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement