
వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో వాణిజ్య యుద్ధం ప్రధాన చర్చగా మారింది. డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఎవరూ సురక్షితంగా లేరంటూ జీ7 దేశాలను కెనడా హెచ్చరించింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానియో జోలీ.. అమెరికాతో తీవ్రమవుతున్న వాణిజ్య పోరాటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య చర్యలతో ఎదురయ్యే పరిణామాలపై మిగిలిన దేశాలను ఆమె హెచ్చరించారు.
అత్యంత మిత్రదేశమైన మాతోనే అమెరికా ఇలా ఉంటే.. ఇక ఇతర దేశాలు సురక్షితంగా ఉండలేవంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాబోయే విపత్తును ముందుగా అంచనా వేసి, మిత్రదేశాల మద్దతును కూడగట్టేందుకు కెనడా ఈ చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇక ట్రంప్ తరచూ కెనడా సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్నవ్యాఖ్యలపై కూడా జోలీ స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులకు తమ దేశం వెనుకంజ వేయదంటూ తేల్చి చెప్పారు. యుద్ధ విన్యాసాలు, ఆయుధ తయారీ వంటి చర్యలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కీలకమైనవిగా ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు, ఆర్థిక కోణంలో మాత్రమే తమ అధ్యక్షుడు కెనడాను 51వ రాష్ట్రం కావాలని ఆకాంక్షించారంటూ అమెరికా మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చారు. ఒక వేళ కెనడా 51 రాష్ట్రం అయితే అప్పుడు సరిహద్దుల గురించి, ఫెంటెనిల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ట్రంప్ భావన’’ అని రూబియో వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్‌వార్‌కు బీజం వేశారు. అమెరికా-కెనడా మధ్య సంబంధాలు కూడా ఎన్నడూ లేని స్థాయిలో దెబ్బతిన్నాయి. కాగా, ట్రంప్.. టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యథావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment