కెనడా కొత్త నిబంధనలు.. భారతీయులకు షాక్‌! | Canada Bill C-12 New immigration law triggers deportation risks Include Indians | Sakshi
Sakshi News home page

కెనడా కొత్త నిబంధనలు.. భారతీయులకు షాక్‌!

Apr 22 2026 3:14 AM | Updated on Apr 22 2026 4:17 AM

Canada Bill C-12 New immigration law triggers deportation risks Include Indians

కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'బిల్ సి-12' చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కెనడాలో స్థిరపడాలని చూస్తున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే బిల్‌ సి-12 భారతీయులకు షాక్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయుల్లో చాలా మంది అమెరికా తర్వాత అత్యంత ఎక్కువగా వెళ్లే దేశం కెనడానే. 

కొత్త నిబంధనల ప్రకారం.. కెనడాలోకి ప్రవేశించిన ఒక ఏడాది లోపు మాత్రమే రిఫ్యూజీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు దాటితే దరఖాస్తును స్వీకరించరు. గతంలో ఏండ్లు గడిచినా పీఆర్ రాకపోతే చివరి అవకాశంగా రిఫ్యూజీ క్లెయిమ్ చేసేవారు. ఇకపై అది సాధ్యపడదు. ఈ చట్టం కేవలం కొత్తవారికి మాత్రమే కాదు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 19వేల దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనుంది. 

దీనివల్ల వేల సంఖ్యలో భారతీయ దరఖాస్తుదారులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తినో కాకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో వీసాలను లేదా ఇమ్మిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే అధికారాన్ని పొందింది. దీని కోసం ప్రతి కేసును విడివిడిగా విచారించాల్సిన అవసరం లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. 

శరణార్థుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయడం, ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం ఈ చట్టంతో సులభతరం అవుతుంది. అయితే మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు దీనిని శరణార్థుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటున్నాయి. 

సరైన విచారణ లేకుండానే వీసాలు రద్దు చేయడం వల్ల విదేశీయులను బలవంతంగా వెనక్కి పంపే ముప్పు పెరుగుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కెనడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అవసరమని ప్రభుత్వం చెబుతోంది. మోసపూరిత దరఖాస్తులను అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. 

కెనడాలో భారతీయ విద్యార్థులు, వర్క్ పర్మిట్ హోల్డర్లు లక్షల్లో ఉన్నారు. పీఆర్ దక్కని వారు చాలామంది రిఫ్యూజీ దరఖాస్తుల మీద ఆధారపడుతుంటారు. కొత్త చట్టం వల్ల పాత కేసులు రీ-ఓపెన్ అవ్వడం లేదా వేగంగా తిరస్కరణకు గురవ్వడం జరిగితే.. భారతీయులు పెద్ద సంఖ్యలో డిపోర్టేషన్  ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement