Britain Queen Elizabeth II: బ్రిటన్‌ మహారాణి కన్నుమూస్తే...!

Britain plan for when Queen Elizabeth II dies - Sakshi

లండన్‌: బ్రిటన్‌లో రాజ వంశంపై ప్రజలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. రాజవంశానికి సంబంధించిన ఏవార్తైనా ప్రజల్లో ఆసక్తి రేకిత్తిస్తుంది. అలాంటిది ఏకంగా మహారాణి మరణానికి సంబంధించిన వార్తైతే దానికి ఉండే ప్రాముఖ్యమే వేరు! రాణిగారి అంతిమశ్వాస నుంచి అధికారికంగా సమాధి చేసేవరకు ఒకపెద్ద మహాయజ్ఞంలాగా నిర్వహిస్తారు. మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌–2 మరణించిన అనంతరం తీసుకొనే చర్యల వివరాలు శుక్రవారం లీకయ్యాయి.

రాణి మరణించిన వెంటనే ఆరంభమయ్యే ఈ కార్యకలాపాలను ‘‘ఆపరేషన్‌ లండన్‌ బ్రిడ్జ్‌’’గా పిలుస్తారని  పొలిటికో వార్తా సంస్థ వెల్లడించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా ‘డీ డే’గా పిలుస్తారని, ఆమె మరణించిన రోజును జాతి సంతాపదినంగా ప్రధాని ప్రకటిస్తారని, సెలవు కూడా ఇస్తారని తెలిపింది.
(చదవండి: మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్‌)
 

రికార్డు పాలన
బ్రిటన్‌ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా ఎలిజబెత్‌2 రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమెకు 95 సంవత్సరాల వయసు. ఆమె తుది శ్వాస విడిచిన అనంతరం పదిరోజుల పాటు పారి్థవ కాయాన్ని అలాగే ఉంచుతారు. ఈ పదిరోజులు ఆమె వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ బ్రిటన్‌ మొత్తం పర్యటించి రాణి మరణ వార్తను పౌరులకు వెల్లడిస్తారు. అనంతరం ఆమెను సమాధి చేసే కార్యక్రమం షురూ అవుతుంది.

మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని మూడు రోజుల పాటు హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌లో సందర్శకుల కోసం ఉంచుతారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు లండన్‌కు వస్తారని, దీంతో ట్రాఫిక్‌ జామ్‌లు, ఆహార కరువు ఏర్పడతాయన్న అంచనాలు లీకైన పత్రాల్లో ఉన్నాయి. సందర్శనార్ధం వచ్చేవారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ ఏర్పాట్లను సైతం ఇందులో పొందుపరిచారు.  ఈ లీకు పత్రాలపై స్పందించేందుకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు నిరాకరించాయి.
(చదవండి: TSRTC-Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top