వామ్మో.. ఇదేం డ్రెస్‌ తల్లి..! | Bride Creates Guinness World Record For Wearing Long Wedding Veil | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఇదేం డ్రెస్‌ తల్లి..!

Apr 3 2021 3:59 PM | Updated on Apr 3 2021 4:27 PM

Bride Creates Guinness World Record For Wearing Long Wedding Veil - Sakshi

నికోసియా: వివాహ వేడుకలు కొత్త పోకడలు పోతున్నాయి. పంచ భూతాల సాక్ష్యిగా అన్నట్లు గాలి, నింగి, నీరు, ఆకాశం ఇలా రకరకాల వేదికల మీద పెళ్లిల్లు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో వేలం వెర్రి వేషాలు వేసేవారు బాగా పెరిగారు ఈ మధ్య కాలంలో. ఇక పెళ్లి బట్టల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్థాయికి తగ్గట్లు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఇంత ఖరీదు పెట్టి కొన్న దుస్తులను మళ్లీ వాడతారా అంటే చాలా వరకు లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే తాజాగా ఓ మహిళ తన పెళ్లి డ్రెస్‌తో ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌‌ రికార్డుల్లోకి ఎక్కింది. 

ప్రపంచంలోనే అత్యంత పొడవైన వెయిల్‌(పాశ్యాత్య వివాహ వేడుకలో పెళ్లి కుమార్తె తల మీద ధరించే వస్త్రాన్ని వెయిల్‌ అంటారు) ధరించిన మహిళగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ఇది ఎంత పొడవు ఉందంటే..6962.6 మీటర్లు. అంటే ఒకటీ కాదు రెండూ కాదు ఏకంగా 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానం అన్నమాట. మరి అంత పొడువున్న ఆ వస్త్రాన్ని ఆమె ఎలా ధరించింది అంటే.. రికార్డు కోసం ఆ మాత్రం చేయక తప్పదు కదా అంటుంది. 

సైప్రస్‌కు చెందిన మరియా పరస్కేవా తన వెడ్డింగ్ డ్రెస్‌తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సందర్భంగా మరియా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నా కల ఒక్కటే. నా వివాహంలో ప్రపంచంలోనే అతి పెద్ద వెయిల్‌ ధరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేయాలనేది నా కోరిక. ఈ రోజు అది నిజమయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది. ఈ వెయిల్‌ డిజైన్‌ చేయడం కోసి మరియా 7,100 మీటర్ల క్లాత్‌ కొనుగోలు చేసింది. గ్రీస్‌కు చెందిన ఓ కంపెనీ దాదాపు మూడు నెలల పాటు కష్టపడి దీన్ని డిజైన్‌ చేసింది. నిపుణులైన టైలర్లు స్వయంగా చేతులతో ఈ ముక్కలను కలిపి పూర్తి అతిపెద్ద వెయిల్‌ను రూపొందించారు.

వివాహం జరిగిన స్టేడియం మొత్తాన్ని ఈ వెయిల్ కప్పేసింది. ఆ వస్త్రాన్ని మైదానంలో అమర్చడానికి 30 మంది వలంటీర్లు 6 గంటల పాటు కష్టపడ్డారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు అన్ని సుఖసంతోషాలతో ఆమె వైవాహిక జీవితం ఇంతే సుదీర్ఘగంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి కొందరేమో ఆ వెయిల్‌ని కాస్త పైకి లేపితే టెంట్‌లా మారుతుంది. ఎంచక్క ఎండ కొట్టకుండా ఉంటుంది అంటూ జోక్‌ చేస్తున్నారు. 

చదవండి: హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్‌ రికార్డా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement