టికెట్‌ అడిగేసరికి బిడ్డనే వదిలేశారు!

Belgian couple leaves baby at check-in counter of Israeli airport - Sakshi

టెల్‌అవీవ్‌: బెల్జియం పాస్‌పోర్టులున్న ఆ దంపతులిద్దరూ ఏడాది వయస్సున్న బిడ్డను తీసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో బయలుదేరే బ్రస్సెల్స్‌ విమానంలో వారు ఎక్కాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చిన వారిని ఒకటో నంబర్‌ టెర్మినల్‌ వద్ద సిబ్బంది ఆపి టికెట్లడిగారు. రెండు టికెట్లే చూపారు. చిన్నారికి కూడా టికెట్‌ కావాలనే సరికి ఇదేమిటంటూ ప్రశ్నించారు. సిబ్బందితో వాదనకు దిగారు. మరో టికెట్‌ కొనడానికి నిరాకరించారు. పైపెచ్చు, ష్ట్రోలర్‌పైన చిన్నారిని అక్కడే సెక్యూరిటీ విభాగం వద్ద వదిలేసి హడావుడిగా విమానం వైపు వెళ్లిపోబోయారు.

ఇది చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది అలెర్ట్‌ చేయడంతో సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో ఉన్న బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. టికెట్‌ అడిగారనే కారణంతో ఏకంగా బిడ్డనే వదిలేసిన తల్లిదండ్రులను ఇప్పుడే చూస్తున్నామని అక్కడి సిబ్బంది వ్యాఖ్యానించారు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమకు షాక్‌ కలిగించిందని సిబ్బంది తెలిపారని రియాన్‌ఎయిర్‌ విమానయాన సంస్థ అధికారి ఒకరు అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top