ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూలై 4 నుంచి 9 వరకు టెహ్రాన్, ఖోమ్, మష్హద్ నగరాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలపై ప్రపంచ దృష్టి నెలకొంది. అయితే ఈ అంత్యక్రియల కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం.. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తొలిసారిగా బహిరంగంగా కనిపిస్తారా లేదా అన్నదే. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత అత్యున్నత పదవిని చేపట్టిన ఆయన ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో అలీ ఖమేనీ మరణానంతరం ఇరాన్ అత్యున్నత మతపరమైన సంస్థలు, రాజకీయ నాయకత్వం అత్యవసరంగా సమావేశమై మొజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించాయి. అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్క బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసంగం చేయలేదు. ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. వీడియో సందేశం, ఆడియో ప్రసంగం కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యం, అధికార బదిలీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు గతంలో వెల్లడించారు. ముఖానికి తీవ్ర గాయాలు, కాలికి గాయాలైనట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన పూర్తిగా ప్రజలకు దూరంగా ఉండటంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.
కాగా, జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే అంత్యక్రియల సందర్భంగా మొజ్తబా ఖమేనీ ప్రత్యక్షంగా హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆయన బహిరంగంగా కనిపిస్తే, కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన అధికారాన్ని ప్రజలకు, ప్రపంచానికి చాటిచెప్పే తొలి సందర్భంగా భావిస్తున్నారు. మరోవైపు, ఆయన గైర్హాజరు అయితే ఆరోగ్య పరిస్థితి, అధికార నిర్వహణపై ఉన్న సందేహాలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచ నేతలు హాజరు..
ఇదిలా ఉండగా.. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఖమేనీ అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమాల అనంతరం ఖోమ్‌లో మతపరమైన నివాళులు, ఆపై మష్హద్‌లోని పవిత్ర స్థలంలో ఖననం జరగనుంది. ఈ కార్యక్రమాలకు పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంత్యక్రియలు అత్యంత సున్నితమైన కార్యక్రమంగా మారాయి.
ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఇప్పటికే తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. కీలక ప్రభుత్వ భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద అత్యున్నత స్థాయి అప్రమత్తత కొనసాగుతోంది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజకీయ, మతపరమైన నాయకత్వంలో చోటుచేసుకున్న మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


