కోడికి మెదడు ఉంటుంది.. అది తినే 111 ఏళ్లుగా..

Australia 111 Year Old Man Reveals Long Life Secret Eating Chicken Brains - Sakshi

సిడ్నీ: ప్రస్తుత కాలంలో మనిషి అరవై ఏళ్లు బతికితే గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఓవైపు కాలుష్యం, మరోవైపు మారిన ఆహారపుటలవాట్లు మానవుడి ఆయుర్దాయంపై ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే బీపీలు, షుగర్‌ బారిన పడటం, గుండెపోటుతో మరణించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు తోడు మహమ్మారి కరోనా వంటి వైరస్‌ల దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువత పరిస్థితి ఇలా ఉంటే, కొంతమంది శతాధిక వృద్ధులు మాత్రం ‘సెంచరీలు కొట్టే’సిన వయస్సు మాది అంటూ జీవన గమనంలోని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు.

ఆస్ట్రేలియాకు చెందిన డిక్చర్‌ క్రూగర్‌ కూడా అలాంటి వారే. 111 ఏళ్ల క్రూగర్‌ నేటికీ ఆరోగ్యంగా జీవిస్తూ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. సోమవారం నాటితో 111 ఏళ్ల 124 పూర్తి చేసుకుని, మొదటి ప్రపంచ యుద్ధ వీరుడు జాక్‌ లాకెట్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. ఆస్ట్రేలియాలోని అత్యంత వృద్ధ వ్యక్తి(జీవించి)గా ఆస్ట్రేలియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

ఇక తన ఆరోగ్య రహస్యాల గురించి క్రూగర్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ..  ‘‘చికెన్‌ బ్రెయిన్స్‌. మీకు తెలుసా కోళ్లకు తల ఉంటుంది. అందులో మెదడు కూడా. చాలా చిన్నది. కానీ భలే రుచిగా ఉంటుంది. వారానికోసారి తింటాను. అదే నన్ను ఆరోగ్యంగా ఉండేలా చేసిందని భావిస్తా’’ అని చెప్పుకొచ్చారు. ఇక క్రూగర్‌ 74 ఏళ్ల కుమారుడు గ్రెగ్‌ మాత్రం.. ‘‘అదొక్కటే కాదు. క్రమశిక్షణ కలిగిన జీవన శైలే మా నాన్న ఇలా ఉండటానికి కారణం’’ అని పేర్కొన్నారు. 

కాగా క్వీన్‌ల్యాండ్‌లోని గ్రామీణ ప్రాంతంలో, పశువుల కాపరి అయిన క్రూగర్‌కు ఓ నర్సింగ్‌ హోం ఉంది. ప్రస్తుతం ఆయన తన అద్భుతమైన లైఫ్‌స్టోరీకి పుస్తకరూపం తీసుకువచ్చే పనిలో ఉన్నారని, చాలా మంచి వ్యక్తి అని నర్సింగ్‌ హోం మేనేజర్‌ క్రూగర్‌ గురించి చెప్పారు. కాగా ఆస్ట్రేలియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వ్యవస్థాపకుడు జాన్‌ టేలర్‌ చెప్పిన వివరాల ప్రకారం, క్రూగర్‌ అతి వృద్ధ ఆస్ట్రేలియన్‌ కాగా, అధికారికంగా ఈ రికార్డు క్రిస్టియానా కుక్‌(114 ఏళ్ల, 148 రోజులు బతికారు. 2002లో మరణించారు) పేరిట ఉంది. ఇక క్రూగర్‌ చెప్పిన చికెన్‌ బ్రెయిన్‌ సీక్రెట్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

చదవండి: ఇంజనీర్‌తో ఎఫైర్‌: అందుకే బిల్‌ గేట్స్‌ బోర్డు నుంచి వైదొలిగారా?!
111 మంది అబ్బాయిలకు వంద మందే అమ్మాయిలే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top