ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్‌

Apple Watch Saves UK Man Whose Heart Stopped 138 Times In 48 Hours - Sakshi

స్మార్ట్‌ వాచ్‌... ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. వాచ్‌ ప్రాణాలు కాపాడమేంటి? అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అదెలా జరిగిందంటే... యూకేకు చెందిన 54 ఏళ్ల డేవిడ్‌కు ఇటీవల పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సారా, యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది. అది మణికట్టుకు పెట్టుకోగానే.. పల్స్‌రేట్‌ 30గా చూపించింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న పురుషుల హృదయ స్పందనలు నిమిషానికి 100 చొప్పున ఉండాలి.

కానీ డేవిడ్‌కు 30 మాత్రమే నమోదవుతుండటంతో వాచ్‌ సరిగ్గా పనిచేయట్లేదేమోనని డేవిడ్‌ అనుకున్నాడు. కానీ అతని భార్య పదేపదే వెంటపడటంతో హాస్పిటల్‌కు వెళ్లాడు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేయిస్తే... అతను కార్డియాక్‌ అరెస్టుతో మృతి చెందే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. హార్ట్‌ బ్లాక్‌ వల్ల గుండెలోని ‘జంక్షన్‌ బాక్స్‌’ పనిచేయడం ఆగిపోతోందన్నారు. అలా 48 గంటల్లో 138 సార్లు పదేసి సెకన్లపాటు అతని గుండె పనిచేయడం మానేసింది.

డేవిడ్‌ నిద్రిస్తున్న సమయంలో ఇలా జరిగిందట. అంతేకాదు.. అది ఆగిపోయినప్పుడు అతని గుండెలోని మరో భాగం రక్త ప్రవాహాన్ని కిక్‌ స్టార్ట్‌ చేసిందన్నమాట. గుండె సంబంధిత జబ్బు లక్షణాలు కనిపించకపోవడం, అతను ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు సర్జరీతో గుండెలోని బ్లాక్స్‌ను తొలగించారు. అలాగే భవిష్యత్తులో అతని హృదయ స్పందనల్లో ఏమైనా తేడాలు సంభవిస్తే ముందుగానే పసిగట్టేందుకు.. గుండె కవాటాలు సమన్వయంతో పనిచేసేలా చేసేందుకు వీలుగా గుండెలో ఒక ‘పేస్‌మేకర్‌’ పరికరాన్ని సైతం అమర్చారు.

దీంతో ఇప్పుడు అతని గుండె పనితీరు మెరుగుపడింది. ‘నా భార్య నాకు స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చి ఉండకపోతే నా సమస్య బయటపడేది కాదు... నేను బతికి ఉండేవాడిని కాదు. నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాను. ఒక్క చార్జింగ్‌ సమయంలో తప్ప వాచ్‌ ఎప్పుడూ నా చేతికే ఉంటుంది’ అని డేవిడ్‌ చెబుతున్నాడు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top