యూకేలో భారత యువతిపై లైంగిక దాడి.. 45 రోజుల్లో రెండో ఘటన | Indian Origin Girl Racially Motivated At UK West Midlands, MPs Condemn Hate Crime | Sakshi
Sakshi News home page

యూకేలో భారత యువతిపై లైంగిక దాడి.. 45 రోజుల్లో రెండో ఘటన

Oct 27 2025 8:37 AM | Updated on Oct 27 2025 10:20 AM

Indian origin Girl Racially Motivated At UK

లండన్‌: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల భారతీయ యువతిపై లైంగిక దాడి జరిగింది. అయితే, ఈ ఘటన జాతి వివక్షతోనే జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి రోనన్ టైరర్ మాట్లాడుతూ..‘వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో 20 ఏళ్ల భారత సంతతికి చెందిన ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. శనివారం వాల్సాల్‌లోని పార్క్ హాల్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆమెపై జాతి వివక్ష కారణంగానే ఇలా దాడి జరిగింది. ఇందుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేపట్టాం. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ నుండి వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు నేరస్థుడి ఫొటోను విడుదల చేశారు. సాధ్యమైనంత త్వరగా అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆధారాలను సేకరించే అధికార బృందాలు మా వద్ద ఉన్నాయి’ అని తెలిపారు.

సిక్కు యువతిపై లైంగిక దాడి..
ఇక, యూకేలో భారత సంతతి ప్రజలపై జాత్యాహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలలో ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి, జాతి వివక్ష వ్యాఖ్యలతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓల్డ్‌బరీలోని టేమ్ రోడ్ సమీపంలో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, "మీ దేశానికి తిరిగి వెళ్లిపో" అంటూ జాత్యాహంకార వ్యాఖ్యలతో దూషించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిని జాతి వివక్షతో కూడిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన స్థానిక సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో, ప్రాంతంలో గస్తీ పెంచుతామని ఓ సీనియర్ పోలీస్ అధికారి హామీ ఇచ్చారు.

ఈ అమానుష ఘటనను బ్రిటన్ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. "ఇది అత్యంత హింసాత్మక చర్య. 'మీరు ఈ దేశానికి చెందిన వారు కాదు' అని బాధితురాలితో అనడం దారుణం. కానీ ఆమె ఇక్కడికి చెందినవారే. ప్రతీ సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది" అని పేర్కొన్నారు. మరో ఎంపీ జస్ అత్వాల్ స్పందిస్తూ, "దేశంలో పెరుగుతున్న జాతి వివక్ష ఉద్రిక్తతల ఫలితమే ఈ హేయమైన దాడి. దీనివల్ల ఓ యువతి జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement