అమెరికా చరిత్రలోనే చెత్త అధ్యక్షుడిగా ట్రంప్‌..

Actor Arnold Schwarzenegger Slams Donald Trump In video - Sakshi

వాషింగ్టన్‌: ‘డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోయారు’ అని ప్రముఖ హాలీవుడ్‌ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌ ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌‌నెగ్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.‌ గతవారం వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తూ సోమవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ విఫలుడని వ్యాఖ్యానించారు. అంతేగాక దాడికి కారణమైన ట్రంప్‌ మద్దతుదారులను నాజీలతో పోలుస్తూ ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తోటి అమెరికన్‌లకు, నా మిత్రులకు ఇటీవల మన దేశంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను పుట్టి, పెరిగింది ఆస్ట్రియాలో. అక్కడ 1938లో జరిగిన క్రిస్టల్లానాచ్ గురించి (దీన్నే నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్) నాకు తెలుసు. జర్మనీకి చెందిన నాజీలు ఆస్ట్రియాలోని యూదుల ఇళ్లపై దాడికి చేసి పెను విధ్వంసానికి కారణమయ్యారు. (చదవండి: యూఎస్‌: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం)

ఇప్పుడు అమెరికాలోని ప్రౌడ్ బాయ్స్ (ట్రంప్ మద్దతుదారుల గ్రూప్) కూడా అదే చేశారు. ఇటీవల క్యాపిటల్‌ భవనంపై వారు జరిపిన దాడిలో భవనం అద్దం పగిలింది. అయితే అది కేవలం అద్దం మాత్రమే కాదు.. అమెరికా కాంగ్రెస్ చట్ట సభ్యుల ఆలోచన కూడా. ఈ దాడితో వారంతా దేశ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారు’ అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూసేవారెవరూ అధ్యక్షుడిగా ఉండలేరని, ఎన్నికల్లో విజయం సాధించలేరన్నారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా రానున్న కొత్త నేత జో బైడెన్‌కు మద్దతు పలకాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, 'టర్మినేటర్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ ఫ్యామిలీ ఆస్ట్రియా నుంచి అమెరికాకు వలస వచ్చింది. ఆపై ఆయన 2003లో కాలిఫోర్నియా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినప్పటికీ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆయన విమర్శల పాలైన సంగతి తెలిసిందే. (చదవండి: నా కొడుకు వస్తే సర్వనాశనమే: ట్రంప్‌ తల్లి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top