ఆరడుగుల ‘విస్కీ’

6 Foot Tall 32 Year Old Macallan Is The Largest Bottle Of Whisky - Sakshi

ఐదడుగుల 11 అంగుళాలు పొడవు... 32 ఏళ్ల వయసు... బాటిల్‌ చూపించి సినిమాలో హీరో ఎంట్రీలా ఈ ఇంట్రో ఏంటనుకుంటారా? ఆగండాగండి. అవి చిత్రంలో ఉన్న స్కాచ్‌ విస్కీ బాటిల్‌ పొడవు, వయసు. దీన్ని తయారు చేసింది స్కాట్లాండ్‌కు చెందిన మాకల్లన్‌ కంపెనీ. మందు సీసా అనగానే మనకు గుర్తొచ్చేవి హాఫ్, ఫుల్‌.. మహా అయితే లీటర్‌. కానీ ఇది అట్టాంటిట్టాంటిది కాదు. 444 ఫుల్‌బాటిల్స్‌తో సమానమైన 311 లీటర్ల మాంచీ టేస్టీ సింగిల్‌ మాల్ట్‌ స్కాచ్‌.

అందుకే.. గతేడాదే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను బద్దలు కొట్టేసింది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం? అంటే.. ఈ సీసాను మే 25న వేలం వేస్తున్నారు. పాతబడే కొద్దీ ఆల్కహాల్‌ టేస్ట్‌తోపాటు కాస్టు కూడా పెరుగుతుంది కదా! 32 ఏళ్లు పాతదైన ఈ స్కాచ్‌ వేలం ప్రారంభ ధరనే... 12 కోట్ల 47 లక్షల రూపాయలుగా నిర్ణయించింది ప్రముఖ వేలం కంపెనీ లైఆన్‌ అండ్‌ టర్నబుల్‌. వేలం ద్వారా వచ్చిన డబ్బులో 25 శాతాన్ని మేరీ క్యూరీ సంస్థకు చారిటీగా ఇవ్వాలనుకుంటోంది మాకల్లన్‌. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు పోయిన విస్కీ బాటిల్‌ ధర... 1.9 మిలియన్‌ డాలర్లు. అంటే... దాదాపు పద్నాలుగున్నర కోట్లు. ఈ పాత రికార్డును సైతం బద్దలు కొట్టే అవకాశముందీ ఆరడుగుల బాటిల్‌.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top