ఒమన్‌లో వరద బీభత్సం.. ముగ్గురు మృతి | 3 dead in Oman flash floods Dubai Abu Dhabi corridor on alert | Sakshi
Sakshi News home page

ఒమన్‌లో వరద బీభత్సం.. ముగ్గురు మృతి

Mar 22 2026 1:24 PM | Updated on Mar 22 2026 1:24 PM

3 dead in Oman flash floods Dubai Abu Dhabi corridor on alert

మస్కట్/దుబాయ్: గల్ఫ్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలతో ఒమన్, యూఏఈ అతలాకుతలమవుతున్నాయి. ఒమన్‌లో వరద ఉధృతికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం పొడవునా వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని ‘వాడి అల్ మావిల్’ వద్ద వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వేగంగా వచ్చిన నీటి తాకిడికి మూడు వాహనాలు కొట్టుకుపోయాయి.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు మరణించినట్లు ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. సహాయక బృందాలు ఒకరిని ప్రాణాలతో కాపాడగలిగాయి. మస్కట్, అల్ బతినా తీర ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన మరో 40 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. యూఏఈలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్‌లో ఈ రాత్రి భారీ పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఎన్‌సీఎం)అంచనా వేస్తోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల ధూళి మేఘాలు కమ్ముకొని, విజిబిలిటీ గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20°C నుంచి 23°C మధ్య నమోదవుతున్నాయి.
 

వారికి భారీ జరిమానాలు
వరదలను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు వాగులు, వంకల దగ్గరకు వెళ్లే వారికి యూఏఈ హోం మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. వరద కాలువలు లేదా డ్యామ్‌ల వద్ద గుమిగూడినా, ప్రవహిస్తున్న వాగుల్లోకి  వాహనాలతో వెళ్లినా శిక్ష తప్పదని పేర్కొంది.  కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వాడి అల్ నహ్వా’, ‘అల్ హేయర్’ దృశ్యాలు వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మంగళవారం వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: మరో చరిత్ర లిఖించిన ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement