న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా (Head of Government) పనిచేసిన నాయకునిగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు. ఆదివారం (మార్చి 22, 2026) నాటికి ప్రధాని పదవిలో 8,931 రోజులు పూర్తి చేసుకున్న మోదీ.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న సుదీర్ఘకాల పదవీకాల రికార్డును అధిగమించారు. గతంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి చామ్లింగ్ 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు మోదీ ఆ మైలురాయిని అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించడంతో పాటు, భారత ప్రధానిగా మోదీ కొనసాగిస్తున్న పయనం ఈ అరుదైన ఘనతను సాధ్యం చేసింది.
వాద్‌నగర్ నుంచి ఢిల్లీ వరకూ..
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించి, రైల్వే స్టేషన్‌లో తండ్రికి టీ అమ్మడంలో సాయపడిన స్థాయి నుంచి దేశాధినేత వరకు మోదీ ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2014 వరకు సుమారు 13 ఏళ్ల పాటు అదే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో (2014, 2019, 2024) బీజేపీని అఖండ విజయంతో గెలిపించి, హ్యాట్రిక్ ప్రధానిగా రికార్డు సాధించారు.
దిగ్గజాల రికార్డులు బద్ధలు: మోదీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించారు.
ఇందిరా గాంధీ రికార్డు: 2025 జూలైలో ఇందిరా గాంధీ (4,077 రోజులు) రికార్డును అధిగమించి, అత్యధిక కాలం వరుసగా ప్రధానిగా పనిచేసిన రెండో నేతగా నిలిచారు.
నెహ్రూతో సమానంగా: జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక నేతగా మోదీ గుర్తింపు పొందారు.
తొలి ప్రధాని: స్వతంత్ర భారతదేశంలో జన్మించి, ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి వ్యక్తి కూడా నరేంద్ర మోదీనే కావడం విశేషం. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రధాని పీఠాన్ని అధిష్టించిన నేతగా కూడా మోదీ తన ప్రత్యేకత చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: అస్సాం పోరు 2026: ఈ ఐదు అంశాల్లోనే ‘దోబూచులాట’


