200 ఏళ్లనాటి వైన్‌ బాటిల్‌ చోరీ.. మెక్సికన్‌ బ్యూటీ క్వీన్‌ జంట అరెస్ట్‌!

200 Years Vintage Wine Theft Case Mexican Beauty Queen Arrest - Sakshi

మాడ్రిడ్‌: అత్యంత విలువైన పాతకాలపు వైన్‌ బాటిళ్ల చోరీని తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. 1.7 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.13.57 కోట్లు) విలువైన ప్రఖ్యాత వైన్‌ బాటిళ్ల చోరీ కేసులో మాజీ మెక్సికన్‌ బ్యూటీ క్వీన్‌, రోమానియా డచ్‌ వ్యక్తిని పోలీసులు క్రోయేషియాలో అరెస్ట్‌ చేశారు. ఈ విలువైన మద్యం బాటిళ్లు 9 నెలల క్రితం స్పెయిన్‌లో మాయమయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు యూరప్‌ మొత్తం జల్లెడపట్టినట్లు చెప్పారు పోలీసులు. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది స్పెయిన్‌ జాతీయ పోలీసు విభాగం. ‘2021, అక్టోబర్ 21న పశ్చిమ నగరం కేసర్స్‌లో 1.65 మిలియన్‌ యూరోలు విలువ కలిగిన 45 వైన్‌ బాటిళ్లు చోరీకి గురయ్యాయి. అందులో 19వ శతాబ్దానికి చెందిన ఓ ప్రత్యేకమైన బాటిల్‌ సైతం ఉంది. దాని విలువ 3.10 లక్షల యూరోలు. వాటిని ప్రముఖ హోటల్‌ రెస్టారెంట్‌ ఈఐ అట్రియోలోని సెల్లార్‌ నుంచి పక్కా ప్రణాళికతో ఎత్తుకెళ్లారు.’ అని తెలిపారు.

పోలీసుల ప్రకటన ప్రకారం.. స్పానిష్‌ డైలీ ఈఐ పైస్‌కు చెందిన 29 ఏళ్ల మెక్సికన్‌ యువతి.. అట్రియోలోని వెయిటర్స్‌ను రూమ్ సర్వీస్‌ అంటూ దారి మళ్లించింది. ఆ సమయంలోనే ఆమెతో ఉన్న 47 ఏళ్ల వ్యక్తి వైన్‌ బాటిళ్లు ఉన్న సెల్లార్‌లోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న మాస్టర్‌ కీతో బాక్సులను తెరిచి మూడు బ్యాగుల్లో నింపాడు. వాటిని టవల్స్‌లో చుట్టారు. ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బ్యాగులతో సెక్యూరిటీని తప్పించుకుని హోటల్‌ నుంచి వెళ్లిపోయారు. హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రాథమికంగా ఓ గ్యాంగ్‌ పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు భావించారు. ఈ చోరీ జరగక ముందు ఇరువురు మూడు సార్లు అట్రియో హోటల్‌కి వచ్చారు. అందరిలాగే వారికి సైతం వైన్‌ బాటిళ్లు ఉన్న సెల్లార్‌ను చూపించారు హోటల్‌ సిబ్బంది.

చోరీకి గురైన వాటిలో 200 ఏళ్ల నాటి బాటిల్‌..
చోరీకి గురైన వాటిలో 1806 నాటికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్‌ బోర్డియాక్స్‌ యక్వెమ్‌ బాటిల్‌ ఉంది. దాని విలువ భారీగా ఉంటుందని ఎల్‌ అట్రియో సహ యజమాని సొమెలియర్‌ జోస్‌ పోలో చెప్పారు.‘ఆ బాటిల్‌ నా వ్యక్తిగత చరిత్రలో భాగం. ఆ బాటిల్‌ అట్రియో, కేసర్స్, ఇక్కడి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్‌ ప్రేమికుల చరిత్రలో ఒకటి.’ అని పోలో పేర్కొన్నారు. చోరీ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే దొంగలిద్దరు స్పెయిన్‌ దాటి వెళ్లారు. నెలల తరబడి వారికోసం యూరప్‌ మొత్తం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇటీవలే మొంటెనెగ్రో నుంచి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డారు. వారిని పట్టుకునేందుకు నెదర్లాండ్స్‌, క్రొయేషియా, రొమానియా పోలీసులతో పాటు ఇంటర్‌పోల్‌ సాయం కూడా తీసుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసినప్పటికీ చోరీకి గురైన వైన్‌ మాత్రం తిరిగి స్వాధీనం చేసుకోలేదు. 

ఇదీ చదవండి: బాప్‌రే!.. ఆ జంట దొంగలించిన వైన్‌ బాటిల్స్‌ ఖరీదు రూ.3 కోట్లా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top