
కంబైన్డ్ డిఫెన్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఈ నెల 13 నుంచి పరీక్షల నిర్వహణ
● హాజరుకానున్న 8086 మంది అభ్యర్థులు
● ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు
● అన్ని కేంద్రాల్లోనూ మౌలిక వసతుల కల్పన
● జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి
లక్డీకాపూల్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మూడు సెషన్లలో నిర్వహించనున్న డిఫెన్స్ సర్వీస్ పరీక్షతో పాటు పాటు రెండు సెషన్లలో జరిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటా చారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్‌లు, రూట్ ఆఫీసర్లు, లోకల్ ఇన్‌స్పెక్టింగ్ అధికారులు, టైం డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 22 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో 8086 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. అధికారులు పరీక్షా కేంద్రాలను ముందుగా పరిశీలించి వసతులు కల్పనపై నివేదికలు అందజేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఐదు రూట్లుగా విభజించడం జరిగిందని లోకల్ ఇన్‌స్పెక్టింగ్ అధికారులుగా 22 మందిని నియమించామన్నారు. డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, ఇంగ్లిష్, మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు జనరల్ నాలెడ్జ్ పరీక్ష అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఎలిమినేటరి మ్యాథమెటిక్స్ పరీక్ష ఉంటుందన్నారు. విధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ ఎకాడమీ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మ్యాథమెటిక్స్ పరీక్ష , మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందన్నారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. అన్ని కేంద్రాల గేట్లను అరగంట ముందే మూసివేస్తామన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ భాస్కర్, పర్యవేక్షకులు జహీరుద్దీన్ , చీప్ సూపరింటెండెట్‌లు, రూట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.