సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు తొలిసారిగా రానున్న ప్రధాని

PM Modi to flag off Vande Bharat train at Secunderabad station on Apr 8 - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ రానున్న దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి సికింద్రాబాద్‌ స్టేషన్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నాడు అద్వానీ..
ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ను సందర్శించనుండగా.. 2003 ఆగస్టు 9న దేశ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఈ స్టేషన్‌కు రావడం గమనార్హం. నగరంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్‌ ప్రారంభోత్సవం కోసం అద్వానీ సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చారు. ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్‌ రైలును ఆయన ప్రారంభించారు.

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో..
మరోవైపు ప్రధాని మోదీ సందర్శన కూడా చారిత్రాత్మకంగానే నిలిచిపోనుంది. ఎందుకంటే నిజాం కాలంనాటి ఈ పురాతన రైల్వేస్టేషన్‌ పూర్తిగా మారిపోనుంది. పునరభివృద్ధి కారణంగా 2025 నాటికి ఇది అత్యాధునిక రైల్వేస్టేషన్‌గా అవతరించనుంది. ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రయాణికులకు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. నిజాం కాలం నాటి చారిత్రక సికింద్రాబాద్‌ స్టేషన్‌ను సందర్శించిన ఘనత కూడా ప్రధానికి దక్కనుంది.

అప్పుడు మొదటి దశ.. ఇప్పుడు రెండో దశ..
ఎంఎంటీఎస్‌ మొదటి దశ రైళ్లను అప్పటి ఉప ప్రధానిఎల్‌కే అద్వానీ ప్రారంభించగా ఇప్పుడు ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మేడ్చల్‌– సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా–ఉందానగర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ సేవలను ఆయన నగరవాసులకు అందుబాటులోకి తేనున్నారు. దీంతో మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా, ఉందానగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకొనే అవకాశం లభిస్తుంది. అలాగే మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా లింగంపల్లి వరకు కూడా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు.

● 2013లో ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టును ప్రారంభించారు. సుమారు రూ.816 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1150 కోట్ల వరకు చేరింది. ఇంకా కొన్ని రూట్‌లలో పనులు కొనసాగుతున్నాయి. మౌలాలి– సనత్‌నగర్‌ మధ్య సుమారు 5 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశ కోసం ఇటీవల కేంద్రం రూ.600 కోట్లు మాత్రమే కేటాయించిన సంగతి తెలిసిందే. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టినప్పటికీ రాష్ట్ర వాటాగా పూర్తిస్థాయిలో అందజేయకపోవడంతో కేంద్రమే ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top